Generators
-
మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో పూర్తిస్థాయి విద్యుత్ ఉత్పత్తి
ఆంధ్ర– ఒడిశా సరిహద్దు ప్రాంతంలో చుట్టూ ఎత్తయిన కొండలు..ఆకట్టుకునే జలపాతాలు.. ప్రకృతి సోయగాల మధ్య పురుడుపోసుకున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం ఎన్నో ఏళ్ల తరువాత పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. ఈ కేంద్రంలో జనరేటర్లన్నీ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. దీనిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఆంధ్ర, ఒడిశా ప్రభుత్వాలు రూ.500 కోట్లు వెచ్చించాయి. ముంచంగిపుట్టు: మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఇక్కడ ఆరు జనరేటర్లు సేవలందిస్తున్నాయి. 1, 2, 3 జనరేటర్లతో 51, 4,5,6 జనరేటర్లతో 69 చొప్పున 120 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. సుమారు 65 సంవత్సరాల క్రితం ఏర్పాటుచేసిన ఈ విద్యుత్ కేంద్రంలో పురాతన యంత్రాలు కావడంతో గత పదేళ్లలో పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేసిన దాఖలాలు లేవు. తరచూ సాంకేతిక సమస్యలతో అధికారులు, సిబ్బంది ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనేవారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నుంచి తప్పించుకొని ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు పూర్తి స్థాయిలో విద్యుత్ కేంద్రంపై దృష్టి సారించి, శత శాతం విద్యుత్ ఉత్పత్తిని చేయగలిగారు. నాగార్జున సాగర్, సీలేరు వంటి పలు విద్యుత్ కేంద్రాలు కేవలం పీక్‌లోడ్ అవర్స్‌లో మాత్రమే ఉత్పాదన చేస్తుండగా మాచ్‌ఖండ్ మాత్రం ఏడాది పొడవునా ఉత్పత్తి చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం విద్యుత్ కేంద్రంలో ఆరు జనరేటర్లతో 120 మోగావాట్లు విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. డుడుమ, జోలాపుట్టు ప్రధాన ఆధారం మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంంద్రంలో ఉత్పత్తికి నీరందించేందుకు ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న డుడుమ, జోలాపుట్టు జలశయాలు ప్రధాన ఆధారం. డుడుమ నీటి సామర్థ్యం 2590, జోలాపుట్టు నీటి సామర్థ్యం 2750 అడుగులు. వీటికి మత్స్యగెడ్డ నీరే దిక్కు. జి. మాడుగుల మండలం గెమ్మెలి నుంచి మొదలై మత్స్యగుండం మీదుగా పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో ఈ గెడ్డ విస్తరించింది. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటిని ఏడాది పొడవునా రెండు జలశయాల్లో నిల్వ చేస్తారు. డుడుమ కెనాల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి నీటిని విడుదల చేస్తుంటారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం విడుదల అయినా నీరు తొలుత అప్పర్ సీలేరు వద్ద 240 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అక్కడ నుంచి ఆంధ్ర భాగస్వామ్యం మొదలై డొంకరాయి వద్ద 25 మెగావాట్లు, లోయర్ సీలేరు వద్ద 460 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసిన తరువాత మిగతా నీరు గోదావరిలో కలుస్తోంది రూ.500 కోట్లతో ఆధునికీకరణ.. 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న జల విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన జనరేటర్లు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. మరమ్మతుల పేరిట ఏటా రూ. కోట్లు ఖర్చవుతున్నాయి. ప్రతీ జలవిద్యుత్ కేంద్రంలో జనరేటర్లు 25 ఏళ్లు వరకు మాత్రమే పని చేస్తాయి. కాని ఇక్కడ జనరేటర్లు 60 ఏళ్లు పైబడినా సేవలందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది ఆంధ్ర–ఒడిశా ప్రభుత్వాలు మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని ఆధునికీకరణకు నిర్ణయించాయి. ఇందుకు రూ. 500 కోట్లు కేటాయించాయి. విద్యుత్ కేంద్రంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి నివేదిక తయారీ బాధ్యత టాటా ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకు ఏపీజెన్కో వర్గాలు అప్పగించాయి. దీంతో అదే సంస్థకు చెందిన 14 మందితో కూడిన బృందం గత ఏడాది డిశంబర్ నెలలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రాన్ని సందర్శించింది. జనరేటర్లు, టర్బైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, స్విచ్‌యార్డులు, భవనాల స్థితిగతులను పరిశీలించింది. వాటికి ఆయువు (ఎనాలసిస్) పరీక్షలు నిర్వహించింది. దీనిపై నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కన్సల్టెన్సీ బృందం అందజేసింది. పూర్తిస్థాయిలో ఉత్పాదన శుభపరిణామం విద్యుత్ ఉత్పత్తిలో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం పనితీరు ఎంతో ప్రత్యేకం. చాలా రోజుల తరువాత పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పాదన జరగడం శుభపరిణామం. నాగార్జునసాగర్, సీలేరు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే మాచ్‌ఖండ్ విద్యుత్ ఉత్పత్తి తక్కువే అయినా వాటికి ధీటుగా ఉత్పాదకత ఉంటుంది. ఆధునికీకరణ కోసం ఇరు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. ఈ పనులు పూర్తయితే మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఎంతో మేలు జరుగుతుంది. – కేవీ నాగేశ్వరరావు, సీనియర్ ఇంజినీర్, మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం -
వాటర్ జనరేటర్లు: గాల్లోంచి తాగు నీరు ఎలా వస్తుందంటే..
మంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తట్టుకునేందుకు యూఏఈ, టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. వాటర్ జనరేటర్ల సాయంతో తేమ నుంచి నీటిని తయారు చేసుకుంటోంది. అదీ పర్యావరణానికి ఎలాంటి భంగం కలిగించకుండానే!. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా.. త్వరలో అధికారికంగా ఈ సెటప్‌ను దేశవ్యాప్తంగా లాంఛ్ చేయనుంది. విశేషం ఏంటంటే.. తాగు నీరు కోసం జరిగిన ప్రయోగాల్లో ఇదే భారీ సక్సెస్ కూడా. అబుదాబి: పూర్తిగా సోలార్ పవర్‌తో నడిచే ప్రాజెక్ట్ ఇది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. హైపర్-డెహూమిడీఫైయర్స్ అనే జనరేటర్ల(20 జనరేటర్ల దాకా) సాయంతో రోజూ 6,700 లీటర్ల తాగు నీటిని తయారు చేశారు. పైగా ఇది నిరంతర ప్రక్రియ కావడం విశేషం(ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం మొదటిది ఇదే). ఇవి ఎలా పని చేస్తాయంటే.. సోలార్ ప్యానెల్స్- భారీ ఫ్యాన్లు-పైపులను అనుసంధానించి ఈ వాటర్ జనరేటర్ల సెటప్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లు వాతావరణంలోని తేమను లాక్కుని.. అనుసంధానంగా ఉన్న పైపుల ద్వారా జనరేటర్ సెటప్‌లకు చేరవేస్తాయి. ఈ మధ్యలో పైపుల గుండా తేమకు ప్రత్యేకమైన లిక్విడ్(చల్లబరిచేవి) చేరుస్తారు. తద్వారా ఆ తేమ పోయే కొద్దీ నీటి బిందువులుగా మారతాయి. ఆపై ఆ తేమ నీరు బొట్టు బొట్టుగా పెరిగి.. ఆ నీరు దశలవారీగా ఫిల్టర్ అవుతుంది. ఫైనల్‌గా ఈ వాటర్ జనరేటర్లు తాగు నీటిని బయటకు వస్తుంది. కండిషన్స్ అప్లై ఇలా గాల్లో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేయడం కొత్తేం కాకపోవచ్చు. అయితే అవి అవసరాల కోసమే తప్పించి.. మంచి నీటి కోసం ఉత్పత్తి చేసేవి లేవు. యూఏఈ పరిశోధనలు మాత్రం భారీ లెవల్లో నీటిని ఉత్పత్తి చేయడం, అదీ తాగు నీటి అవసరాల కోసం చేయడం ప్రపంచంలో తొలిసారి. ఇక 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద.. అదీ గాల్లో 60 శాతం తేమ శాతం ఉన్నప్పుడు ఈ వాటర్ జనరేటర్లు పనిచేశాయి(పైలట్ దశలో ఇదే తేలింది). త్వరలో అబుదాబి ఎయిర్పోర్ట్ దగ్గర్లోని మస్దర్ సిటీలో దీనిని లాంఛ్ చేయనున్నారు. సుమారు 54 ఎకరాల్లో సుమారు తొంభై వేల సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సెటప్ ఏర్పాటు చేయబోతున్నారు. -
యంత్రాలు ఉన్నా ఉపయోగం సున్నా..
సాక్షి, పొన్నలూరు (ప్రకాశం): ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సంబంధించిన పనులను సకాలంలో చేసి వారికి మైరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అలాగే మీ–సేవలో నమోదు చేసే పత్రాలను వెంటనే తనిఖీ చేసి అప్లోడ్ చేయడానికి కంప్యూటర్లు, అధికారులు నిర్వహించే వీక్షణ సమావేశాలకు ఎల్ఈడీ ప్రొజెక్టర్‌ను ఏర్పాటు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఉద్యోగుల విధులకు ఆటంకం కలగకుండా నిత్యం కొనసాగించేందుకు జనరేటర్లు కూడా సమకూర్చారు. అయితే అధికారుల బాధ్యాతారాహిత్యంతో పాటు పర్యవేక్షణ లేకపోవడంతో కార్యాలయాల్లో అమర్చిన జనరేటర్లు, ఎల్ఈడీ ప్రొజెక్టర్లు నిరుపయోగంగా మారాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యంతో పాటు రూ.లక్షల ప్రజల సొమ్ము వృథా అవుతోంది. పనిచేయని ఎల్ఈడీ ప్రొజెక్టర్ మండల అభివృద్ధి అధికారులతో పాటు కిందిస్థాయి ఉద్యోగులతో ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్సులు నిర్వహించేందుకు మండల పరిషత్ కార్యాలయంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులు వరకు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో దీని ద్వారా వీడియో కాన్ఫరెన్సులు, ఇతర సమావేశాలు నిర్వహించారు. ఆ తరువాత సెట్‌బాక్స్ మరమ్మతులకు గురికావడంతో కొన్ని నెలలుగా పనిచేయడం లేదు. దీంతో ఎల్ఈడీ ప్రొజెక్టర్ పనిచేయకపోవడంతో సమావేశాలు నిర్వహించడం లేదు. ప్రొజెక్టర్ పనిచేయని విషయాన్ని సంబంధిత ప్రతినిధులకు తెలిపామని, మరమ్మతులు తలెత్తినప్పడు బాగుచేయాల్సిన సంస్థ దృష్టికి తీసుకపోయినా స్పందించడం లేదని కార్యాలయం అధికారులు తెలిపారు. పనిచేయని జనరేటర్లు.. తహశీల్దార్ కార్యాలయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగినప్పడు అన్లైన్ సేవలతో పాటు ఉద్యోగుల విధులు ఆగిపోకూడదని రూ.1.50 లక్షలతో జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. కానీ జనరేటర్ అమర్చిన తరువాత ఒకటి, రెండు సార్లు వినియోగించారు. ఆ తరువాత సుమారుగా ఐదేళ్లు దాటినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఉపయోగించిన దాఖలాలు లేవు. డీజిల్ పోస్తే పనిచేస్తుంది కానీ అందుకు అయ్యే ఖర్చులు ఎవరు భరించాలో తెలియక కార్యాలయం సిబ్బంది పట్టించుకోవడం లేదు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సుమారుగా రూ.60 వేలతో ఏర్పాటు చేసిన మినీ జనరేటర్ నిరుపయోగంగా ఉంది. ఇలా రెండు కార్యాలయాల్లో నిరుపయోగంగా ఉన్న జనరేటర్లను ఒక్కరు కూడా కన్నెత్తిచూసిన పాపాన పోలేదని, యంత్రాలు అందుబాటులో ఉన్నా ఉపయోగమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని నిరుపయోగంగా ఉన్న యంత్రాలు, పరికరాలను వాడుకలోకి తీసుకవచ్చి విధులకు ఆటంకం కలగకుండా చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
భానుడి భగభగ..
- ఎండల జోరు... జనం బేజారు - గరిష్టంగా 40.4, కనిష్టంగా 24.8 డిగ్రీలు నమోదు - వడగాలులతో జనం విలవిల మెదక్ టౌన్: ప్రచండ భానుడి ప్రతాపంతో జనం విల విల్లాడుతున్నారు. ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండకు భయపడి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. శుక్రవారం గరిష్టంగా 40.4 డిగ్రీలు, కనిష్టంగా 24.8 డిగ్రీల ఠమొదటిపేజీ తరువాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపాధి కూలీలు, వరికోతలు కోసే శ్రామికులు ఉదయం 6 నుంచి 9 వరకు, రాత్రి 9 నుంచి 12గంటల పనులు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్ప గడప దాటడం లేదు. అలా బయటకు వచ్చే వారు గొడుగులు, క్యాప్‌లు, చున్నీలు, కండువాలు తలపై రక్షణగా ఉంచుకుంటున్నారు. ఉపశమనం పొందడానికి శీతల పానీయాలను తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. మండుతున్న ఎండలతో పౌల్ట్రీ రైతులు ఆందోళన చెందుతున్నారు. కోళ్ల ఫారాల్లో ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటుచేసి షెడ్లపై గడ్డి కప్పి నీటితో తడుపుతున్నారు. విద్యుత్ కోతల నుంచి ఉపశమనం పొందడానికి జనరేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. కొంతమంది దాతలు అక్కడక్కడ ఏర్పాటు చేసిన చలివేంద్రాలతో ప్రయాణికులు దాహం తీర్చుకుంటున్నారు. మండుతున్న ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లే ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. -
అన్ని పరీక్ష కేంద్రాల్లో జనరేటర్లు కోర్టుకు తెలిపిన విద్యామండలి
ముంబై: మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 231 పరీక్ష కేంద్రాలకు పవర్ జనరేటర్లను, ఇన్వర్టర్లను అందించిందని రాష్ట్ర మాధ్యమిక, ఉన్నత విద్యా మండలి హైకోర్టుకు తెలిపింది. బోర్డుకు చెందిన అధికారులు ఇటీవల అన్ని పరీక్ష కేంద్రాలను సందర్శించి, జనరేటర్లు, ఇన్వర్టర్లును తనిఖీ చేశారని పేర్కొంది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకట్లో పరీక్షలు రాయాల్సి వస్తోందని విష్ణు గవలి అనే సామాజిక కార్యకర్త హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పరీక్షలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ అభయ్ నేత ృత్వంలోని ధర్మాసనానికి బోర్డు ఈ విషయం తెలిపింది. విద్యుత్ కోతల వల్ల విద్యార్థులు చీకటిలో పరీక్షలు రాయాల్సివస్తోందని, అన్ని పరీక్ష కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన జనరేటర్లు ఏర్పాటు చేయాలని కోర్టు జులైలో ఆదేశించడంతో ప్రభుత్వంలో చలనం మొదలైంది. అయితే 18 పరీక్షా కేంద్రాల్లో వాటిని ఏర్పాటు చేయలేద ని విద్యామండలి కోర్టుకు విన్నవించింది. దీంతో పరీక్ష కేంద్రాల్లో విద్యుత్ పరికరాలు ఏర్పాటు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. కేంద్రాల్లో విద్యుత్ కోతల సమస్యను 2008లో కోర్టుకు విన్నవించానని, కోర్టు దాన్ని పిల్‌గా స్వీకరించిందని విష్ణు గవలి తెలిపారు. 2009 ఫిబ్రవరిలో హైకోర్టు ప్రభుత్వానికి అన్ని కేంద్రాల్లో 40వేలకు పైగా జనరేటర్లు ఏర్పాటుచేయాలని నిర్దేశించిందని తెలిపారు. అలాగే పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించొద్దంటూ రాష్ట్ర విద్యుత్ బోర్డుకు ఆదేశించింది. -
కరెంట్ ‘కట్’.. చీకట్లోనే దీపావళి..
* విద్యుత్ నిలిపివేసిన బీఎంసీ * జనరేటర్లతో నెట్టుకువస్తున్న కుటుంబాలు సాక్షి, ముంబై : నగరంలోని అక్రమ ఫ్లాట్లకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యుత్‌ను నిలిపి వేయడంతో ఆయా ప్రాంతాల వారు అంధకారంలోనే దీపావళిని జరుపుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కూడా వీరు పండుగను జరుపుకోలేదు. వీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికి వారు ఖాళీ చేయకపోవడంతో బీఎంసీ వీరికి విద్యుత్ సరఫరాను నిలిపి వేసింది. దీంతో వీరు బ్లాక్ దీపావళిని జరుపుకున్నారు. జీ/సౌత్ వార్డ్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వారికి బీఎంసీ విద్యుత్‌ను నిలిపివేసింది. అయితే వీరు రాత్రి వేళ్లలో జనరేటర్లు, ఎమర్జెన్సీ లైట్లను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా మిడ్డౌన్ అపార్ట్మెంట్లో ఉంటున్న విద్యా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సారి తాము దీపావళిని ఎమర్జెన్సీ లైట్లు ఉపయోగించి జరుపుకున్నామని విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా తాము దీపావళిని ఆనందంగా జరుపుకోలేదన్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు చెప్పడంతో తాము నిరుత్సాహానికి గురై ఆ రోజు ఆందోళనకు కూడా దిగామన్నారు. దీంతో దీపావళిని జరుపుకోలేదన్నారు. కాగా, తాము చివరి అంతస్తులో ఉండడంతో వేడితాపం అంతగా తెలియడం లేదనీ, కానీ కింది అంతస్తులలో ఉంటున్నవారు మాత్రం వేడివల్ల ఉక్కపోతను భరించలేక పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీఎంసీ జీ/సౌత్ వార్డ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వీరు తమ ఇళ్లను అప్పగించే వరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాగా, అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదాపు 140 కుటుంబాలకు ఖాళీ చేయాల్సిందిగా బీఎంసీ గత ఏడాదే నోటీసులు జారీ చేసింది. -
రైతుల పడిగాపులు
వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ - పైరును కాపాడుకునేందుకు పొలాల వద్దే నిరీక్షణ - తొమ్మిది గంటల కరెంట్ సరఫరాలో సర్కారు విఫలం - జనరేటర్ల సాయంతో సేద్యానికి ప్రయత్నాలు చిలకలూరిపేటరూరల్ : వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పైరును బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ ఇస్తారో తెలియక పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్ సరఫరా లేక బోరు నీరు లభిస్తున్న ప్రాంతాల్లో సైతం పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పొలాలను వదులుకోలేని రైతులు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని పైరును బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సాగు వ్యయం పెరుగుతోందని వాపోతున్నారు. మండలంలో మొత్తం 513 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిట్టపాలెంలో ఒకటి, పసుమర్రులో 15, తాతపూడిలో 16, గొట్టిపాడులో ఒకటి, కావూరులో 34, కొత్తపాలెంలో ఐదు, మద్దిరాలలో 14, పోతవరంలో ఆరు, రామచంద్రాపురంలో 37, బొప్పూడిలో 45, గోపాళంవారిపాలెంలో 43, కట్టుబడివారిపాలెంలో ఆరు, రాజాపేటలో 23, యడవల్లిలో 34, గంగన్న పాలెంలో ఎనిమిది, కమ్మవారిపాలెంలో 10, గోవిందపురంలో 14, మురికిపూడిలో 128, వేలూరులో ఏడు ఉన్నాయి. ఇవికాక మరో 35 ఫీజు చెల్లించే కనెక్షన్లు ఉన్నాయి. ఖరీఫ్ ప్రారంభ మై మూడు నెలలు గడిచినా నేటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. మండలంలో కూరగాయలతోపాటు బొప్పాయి పంటలను కూడా సాగుచేస్తున్నారు. బోర్లు ఆధారంగా పొలాలకు నీటిని అందించాలని ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలం కావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మొలకెత్తిన మొక్కలను బతికించుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేళా పాళా లేని కోతలు .... వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ ఎప్పు డు ఇస్తారో తెలియక రైతులు పొలాల వద్దే నిరీక్షిస్తున్నారు. ఉచితంగా ఏడు గంటలు అందాల్సిన విద్యుత్ రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం విద్యుత్ సరఫరా వేళలు తెలిపే అధికారులు కూడా లేరనివాపోతున్నారు.మండలంలో పసుమర్రు, కావూరు, మద్దిరా ల, బొప్పూడి గ్రామాల్లో నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నా ప్రయోజనం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.