రైతుల పడిగాపులు | farmers problems with current cuts, to arrange the generators | Sakshi
Sakshi News home page

రైతుల పడిగాపులు

Published Sun, Aug 17 2014 1:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

రైతుల పడిగాపులు - Sakshi

రైతుల పడిగాపులు

వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్
- పైరును కాపాడుకునేందుకు పొలాల వద్దే నిరీక్షణ
- తొమ్మిది గంటల కరెంట్ సరఫరాలో సర్కారు విఫలం
- జనరేటర్ల సాయంతో సేద్యానికి ప్రయత్నాలు
 చిలకలూరిపేటరూరల్ : వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పైరును బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ ఇస్తారో తెలియక పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే  ఆ హామీని అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్ సరఫరా లేక బోరు నీరు లభిస్తున్న ప్రాంతాల్లో సైతం పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పొలాలను వదులుకోలేని రైతులు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని పైరును బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సాగు వ్యయం పెరుగుతోందని వాపోతున్నారు.
 
మండలంలో మొత్తం 513 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిట్టపాలెంలో ఒకటి, పసుమర్రులో 15, తాతపూడిలో 16, గొట్టిపాడులో ఒకటి, కావూరులో 34, కొత్తపాలెంలో ఐదు, మద్దిరాలలో 14, పోతవరంలో ఆరు, రామచంద్రాపురంలో 37, బొప్పూడిలో 45, గోపాళంవారిపాలెంలో 43, కట్టుబడివారిపాలెంలో ఆరు, రాజాపేటలో 23, యడవల్లిలో 34, గంగన్న పాలెంలో ఎనిమిది, కమ్మవారిపాలెంలో 10, గోవిందపురంలో 14, మురికిపూడిలో 128, వేలూరులో ఏడు ఉన్నాయి. ఇవికాక మరో 35 ఫీజు చెల్లించే కనెక్షన్లు ఉన్నాయి.
 
ఖరీఫ్ ప్రారంభ మై మూడు నెలలు గడిచినా నేటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. మండలంలో కూరగాయలతోపాటు బొప్పాయి పంటలను కూడా సాగుచేస్తున్నారు. బోర్లు ఆధారంగా పొలాలకు నీటిని అందించాలని ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది.
 వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలం కావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మొలకెత్తిన మొక్కలను బతికించుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
వేళా పాళా లేని కోతలు ....
వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ ఎప్పు డు ఇస్తారో తెలియక రైతులు పొలాల వద్దే నిరీక్షిస్తున్నారు. ఉచితంగా ఏడు గంటలు అందాల్సిన విద్యుత్ రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం విద్యుత్ సరఫరా వేళలు తెలిపే అధికారులు కూడా లేరనివాపోతున్నారు.మండలంలో పసుమర్రు, కావూరు, మద్దిరా ల, బొప్పూడి గ్రామాల్లో నాలుగు విద్యుత్ సబ్‌స్టేషన్‌లు ఉన్నా ప్రయోజనం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement