పెళ్లిళ్లు.. విడాకులు.. డబ్బులు!
పెళ్లిళ్లు.. విడాకులు.. డబ్బులు!
Published Mon, Sep 18 2017 3:03 AM | Last Updated on Tue, Sep 19 2017 4:41 PM
ఇప్పటివరకు 3 పెళ్లిళ్లు చేసుకున్న డాక్టర్
- డబ్బులు వసూలు చేసి ఇద్దరు భర్తల నుంచి విడాకులు తీసుకున్న సరిత
- మూడో భర్త ఫిర్యాదుతో ఆమె బాగోతాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ భర్తపై కేసు పెట్టడం.. వారి నుంచి లక్షల్లో డబ్బులు దండుకోవడం.. ఆ తర్వాత కోర్టు నుంచి విడాకులు తీసుకుని మరొకరిని వివాహం చేసుకోవడం.. ఇది హైదరాబాద్‌లోని తార్నాక వాసి అయిన 32 ఏళ్ల హోమియోపతి డాక్టర్ చివాకుల సరిత చరిత్ర.. ఇలా 12 ఏళ్లలో ముగ్గురిని వివాహం చేసుకుని భర్తలను అష్టకష్టాలు పెట్టిన సరితను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఆమెపై వనస్థలిపురానికి చెందిన మూడో భర్త బీవీఎస్ ప్రకాశ్‌రావు ఫిర్యాదు చేయడంతో సరిత బాగోతాలు వెలుగులోకి వచ్చాయి.
మొదటి పెళ్లి..
2005, ఫిబ్రవరి 11న కర్ణాటక హుబ్లీకి చెందిన కె.రామానంద శంకర్‌ను సరిత మొద టి వివాహం చేసుకుంది. ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. సరిత కోరిన మేరకు రూ. 6 లక్షలు, 20 తులాల బంగారం చేతికి అందాక.. 2010, అక్టోబర్ 22న హుబ్లీ కోర్టు ద్వారా శంకర్ నుంచి విడాకులు తీసుకుంది.
రెండో పెళ్లి..
2011, మార్చి 18న చందానగర్‌కు చెందిన వెంకటరాంబాబుతో సరితకు ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. కేవలం నెల రోజులకే అదనపు కట్నం కోసం వెంకటరాంబాబు, అతడి తల్లిదండ్రులు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించింది. వారి నుంచి రూ. 9 లక్షలు చేతికి అందాక హఫీజ్ కోర్టులో విడాకులు తీసుకుంది.
మూడో పెళ్లి..
2015, డిసెంబర్ 27న సరితను వనస్థలిపురానికి చెందిన బీవీఎస్ ప్రకాశ్‌రావు పెళ్లాడా డు. అయితే అదనపు కట్నం తేవాలంటూ ప్రకాశ్, అతడి తల్లి వేధిస్తోందని సరూర్‌నగర్‌లోని మహిళా పోలీసుస్టేషన్‌లో జూలై 31న తన తల్లిదండ్రులతో కలసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రకాశ్‌రావును జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. 3 రోజుల అనంతరం బెయిల్‌పై విడుదలైన ప్రకాశ్‌రావు తన భార్య, ఆమె తల్లిదండ్రుల గురించి ఆరా తీశాడు. దీంతో సరిత బాగోతం బయటపడింది. ఆ వివరాలతో వనస్థలిపురం పోలీసులకు ప్రకాశ్‌రావు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సరితను అరెస్టు చేశారు. విచారణలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు నిందితురాలు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
మరొకరితో సన్నిహితంగా.. : 2015లో పుణేకు చెందిన వీరేందర్‌తో సంబంధం ఏర్పరుచుకుని నెల రోజుల పాటు సన్నిహితంగా మెలిగింది. అయితే తనను నమ్మించి మోసగించాడంటూ సదరు వ్యక్తి గురించి పోలీసులను సరిత ఆశ్రయించింది. ఇప్పటికే అతని నుంచి సరిత రూ.80 వేలు దండుకుంది. ఈ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది.
Advertisement
Advertisement