సిఫార్సుల పర్వం
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పెరుగుతున్న ఒత్తిడి
ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎంపిక బాధ్యత
పెండింగ్‌లో 1.81 లక్షల దరఖాస్తులు
సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి అర్హుల ఎంపికపై ఒత్తిడి పెరిగింది. దసరా సందర్భంగా పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేయడంతో అనుకున్నట్లుగానే మంత్రులు శంకుస్థాపన నిర్వహించారు. అయితే లబ్ధిదారుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పథకం కింద మంజూరైన ఇళ్లలో సగం స్థానిక ఎమ్మెల్యే, మిగతా సగం జిల్లా మంత్రి ఆధ్వర్యంలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఎంపికే కీలకం
ఈ పథకం కింద జిల్లాకు 6000 ఇళ్లు మంజూరుకాగా, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 400 చొప్పున కేటాయించారు. ఇందుకుగాను 3000 మంది లబ్ధిదారులను ఎమ్మెల్యేలు, మరో 3000 మందిని జిల్లా మంత్రి ఎంపిక చేయాల్సి ఉండడంతో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వారిపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 11 వేలకు పైగా మురికివాడలు ఉండగా జీహెచ్‌ఎంసీ 56 బస్తీల(మురికివాడల)ను మాత్రమే ఇందుకు ఎంపిక చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమను కూడా ఎంపిక చేయాలని వివిధ బస్తీల నుంచి విన్నపాలు వస్తున్నాయి. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమంలో కూడా దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే లబ్ధిదారుల ఎంపికపై ఎలాంటి మార్గదర్శకాలు ప్రకటించని ప్రభుత్వం, మురికివాడల్లో లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను జీహెచ్‌ఎంసీకి అప్పగిచడంతో ఎమ్మెల్యే, మంత్రుల సిఫార్సుల ఆధారంగా ఎంపిక చేపట్టే అవకాశం ఉంది. మంజూరైన కోటా అతి తక్కువ ఉండటం, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బస్తీల ఎంపిక నాయకులకు ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
1.81 లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్
జిల్లాలో దరఖాస్తుదారుల సంఖ్య 1.81 లక్షలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రకటించిన తర్వాత వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల దరఖాస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.