ఆర్‌ఏవై కింద డబుల్ బెడ్‌రూం ఇళ్లు!
కేంద్రానికి టీ సర్కార్ ప్రతిపాదన
అదనపు భారాన్ని భరిస్తామని వెల్లడి
రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్ట్ల కోసం ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక పడక గది ఉండే (సింగిల్ బెడ్ రూమ్) గృహాలను.. రెండు పడక గదులు ఉండే (డబుల్ బెడ్ రూమ్) గృహాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా అయ్యే వ్యయాన్ని తాము భరిస్తామని, ఈ మార్పులకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పేదలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో.. ఆర్‌ఏవై పథకంలో మార్పులు చేయాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది.
ఇందుకోసం అయ్యే వ్యయ అంచనాలను సీఎం కార్యాలయం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నుంచి తెప్పించుకుంది. ఆర్‌ఏవై కింద కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా.. అదనపు పడక గది నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ. 7 లక్షలకు పెరుగుతుందని మెప్మా సీఎంవోకు నివేదించింది. దీనిపై సీఎం చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన కోసం గత యూపీఏ ప్రభుత్వం 2009-10లో ఆర్‌ఏవైను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
విడుదల కాని రాష్ట్ర వాటా..
ఆర్‌ఏవై కింద నాలుగు ప్రాజెక్టులు మంజూరై రెండేళ్లు గడిచినా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికయ్యే వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, పురపాలక సంస్థ 10 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ. 14.41 కోట్లు విడుదలకాగా... రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు.