rajiv awas yojana scheme
-
‘స్లమ్’స్యలు లేని సిటీగా..
రాజమండ్రి సిటీ :చారిత్రక రాజమండ్రి నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే రాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా చేపట్టిన సర్వేను అమలు పరచాలని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన స్లమ్ ఫ్రీ సిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తదితర నాయకులు, సిబ్బందితో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆర్థిక సహకారంతో మురికవాడల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏవిధమైన చర్యలు చేపట్టాలనే విషయమై ప్రజాప్రతినిధులతో చర్చించారు. నగరంలో మురికివాడలను గుర్తించి ఏవిధమైన వసతులు అందించాలనే విషయమై ఆర్వీ అసోసియేట్స్ చేపట్టిన సర్వేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈసందర్బంగా అసోసియేట్స్ అసిస్టెంట్ మేనేజర్ బెజవాడ రఘురామ్ మాట్లాడుతూ నగరంలో 88 మురికివాడల్లో పేదలను సర్వే చేయడం ద్వారా 4200 మందికి ఇళ్లు వేవని గుర్తించామన్నారు. వీరికి 13 ఎకరాల్లో 390 కోట్ల వ్యయంతో జీ ప్లస్ త్రీలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా పేదరికం నిర్మూలించే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనిలో 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 15 శాతం కార్పొరేషన్, పదిశాతం లబ్ధిదారులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ విషయమై సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సర్వేలో అంశాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఏవిధమైన సమస్యలు తలెత్త్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మరోసారి అందరితో సమావేశమై చర్యలు చేపట్టనున్నట్టు మేయర్ రజనీ శేషసాయి పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నగర కమిషనర్ రవీంద్రబాబు, వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
తెలంగాణకు మరో మూడు ‘రే’ ప్రాజెక్టులు
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆవాస్ యోజన(రే) కింద రూ.174.68 కోట్ల అంచనా వ్యయంతో తెలంగాణ రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్టులు మంజూరయ్యాయి. నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ మంగళవారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత యూపీఏ హయాంలో రే కింద నాలుగు ప్రాజెక్టులు మంజూరు కాగా.. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా మరో 3 కొత్త ప్రాజెక్టులను మంజూరు చేసింది. తాజాగా మంజూరైన ప్రాజెక్టులను పరిశీలిస్తే.. ఖమ్మం నగరంలోని రమణగుట్టలో రూ.39.43 కోట్లతో 925 గృహాలు, శివారులోని మల్లే మడుగులో రూ.118.44 కోట్లతో 2,375 గృహాలు, కరీంనగర్ జిల్లా రామగుండం పట్టణంలోని సీబీఎన్ కాలనీలో రూ.12.74 కోట్లతో 286 గృహాల నిర్మాణం కోసం మంజూరు లభించింది. -
ఆర్‌ఏవై కింద డబుల్ బెడ్రూం ఇళ్లు!
కేంద్రానికి టీ సర్కార్ ప్రతిపాదన అదనపు భారాన్ని భరిస్తామని వెల్లడి రాష్ట్రానికి మరో మూడు ప్రాజెక్ట్‌ల కోసం ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒక పడక గది ఉండే (సింగిల్ బెడ్ రూమ్) గృహాలను.. రెండు పడక గదులు ఉండే (డబుల్ బెడ్ రూమ్) గృహాలుగా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా అయ్యే వ్యయాన్ని తాము భరిస్తామని, ఈ మార్పులకు అనుమతివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. పేదలకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించి ఇస్తామన్న హామీని నెరవేర్చే క్రమంలో.. ఆర్‌ఏవై పథకంలో మార్పులు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం అయ్యే వ్యయ అంచనాలను సీఎం కార్యాలయం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నుంచి తెప్పించుకుంది. ఆర్‌ఏవై కింద కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల వ్యయం చేయాల్సి ఉండగా.. అదనపు పడక గది నిర్మాణం వల్ల ఈ ఖర్చు రూ. 7 లక్షలకు పెరుగుతుందని మెప్మా సీఎంవోకు నివేదించింది. దీనిపై సీఎం చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో మురికివాడల నిర్మూలన కోసం గత యూపీఏ ప్రభుత్వం 2009-10లో ఆర్‌ఏవైను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. విడుదల కాని రాష్ట్ర వాటా.. ఆర్‌ఏవై కింద నాలుగు ప్రాజెక్టులు మంజూరై రెండేళ్లు గడిచినా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేయకపోవడంతో ఇంకా ఇళ్ల నిర్మాణం మొదలుకాలేదు. ప్రాజెక్టు మార్గదర్శకాల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికయ్యే వ్యయంలో కేంద్రం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 15 శాతం, పురపాలక సంస్థ 10 శాతం నిధులను భరించాల్సి ఉంటుంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి రెండు విడతల్లో రూ. 14.41 కోట్లు విడుదలకాగా... రాష్ట్రం తన వాటా నిధులను విడుదల చేయలేదు. -
‘వాడ’లకు నిధుల వరద
గజ్వేల్, న్యూస్‌లైన్: కొత్తగా ఆవిర్భవించిన నగర పంచాయతీల్లోని మురికివాడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకాన్ని మురికివాడలకు వర్తింపజేసి వాటిని అభివృద్ధి చేసేం దుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని నగర పంచాయతీల్లో సర్వే వేగంగా సాగుతోంది. ఈనెల 25లోగా ఆయా పంచాయతీల్లో మురికివాడలను గుర్తించి వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపే పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు. జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, చేగుంట, జోగిపేట పట్టణాలు కొత్తగా నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. గతంలో మేజర్ పంచాయతీలుగా ఉన్న వీటి స్థాయి పెరిగిన తర్వాత మెరుగైన వసతులు సమకూరుతాయని అంతా భావించారు. కానీ నగర పంచాయతీలకు తగినన్ని నిధులు రాకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లు తయారైంది. కనీస సౌకర్యాలు కరువై ప్రజలు అల్లాడుతున్నారు. పారిశుద్ధ్యలోప నిర్వహణ కూడా సక్రమంగా లేకపోడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారు. నగర పంచాయతీల్లో పల్లెలు కలిసిపోవడంతో మురికి వాడలు కూడా అధికంగానే ఉన్నాయి. ఈ వాడలను అభివృద్ధి చేయడం ‘నగర పంచాయతీ’లకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకం ఈ నగర పంచాయతీలకు ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. గతంలో 5 లక్షల జనాభా కలిగిన మున్సిపాలిటీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే వారు. కానీ ఇపుడు నిబంధనలు మార్చి 35 నుంచి 40 వేల జనాభా కలిగిన కొత్త నగర పంచాయతీలకు కూడా ఈ నిధులు అందించి వాటి అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్(డీఎంఏ) కార్యాలయంలో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల కమిషనర్లతో ప్రత్యేకంగా చర్చించి ఆయా పంచాయతీల్లో అభివృద్ధి చేయాల్సిన మురికివాడలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించారు. అందుకోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం నగర పంచాయతీ కమిషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం సర్వే పనులు ఆయా నగర పంచాయతీల పరిధిలో మురికివాడల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత మురికివాడలకు గుర్తింపునకు సంబంధించిన గెజిట్ ప్రచురిస్తారు. ఆ తర్వాత వాటిని నోటిఫైడ్ మురికివాడలుగా ప్రకటించి, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన ఇళ్లు, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపనున్నారు. దీని ప్రకారం ఒక్కో నగర పంచాయతీకి రూ.5 కోట్లకుపైగానే నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో 15 మురికివాడలను గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక కమిషనర్ సంతోష్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో వెల్లడించారు. ఈనెల 25లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు వచ్చిన తరుణంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసే పనిలో తలమునకలై ఉన్నట్లు ఆయన తెలిపారు.