గజ్వేల్, న్యూస్‌లైన్: కొత్తగా ఆవిర్భవించిన నగర పంచాయతీల్లోని మురికివాడలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకాన్ని మురికివాడలకు వర్తింపజేసి వాటిని అభివృద్ధి చేసేం దుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని నగర పంచాయతీల్లో సర్వే వేగంగా సాగుతోంది. ఈనెల 25లోగా ఆయా పంచాయతీల్లో మురికివాడలను గుర్తించి వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపే పనుల్లో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
జిల్లాలో గజ్వేల్, దుబ్బాక, చేగుంట, జోగిపేట పట్టణాలు కొత్తగా నగర పంచాయతీలుగా ఆవిర్భవించాయి. గతంలో మేజర్ పంచాయతీలుగా ఉన్న వీటి స్థాయి పెరిగిన తర్వాత మెరుగైన వసతులు సమకూరుతాయని అంతా భావించారు. కానీ నగర పంచాయతీలకు తగినన్ని నిధులు రాకపోవడంతో అభివృద్ధి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లు తయారైంది. కనీస సౌకర్యాలు కరువై ప్రజలు అల్లాడుతున్నారు. పారిశుద్ధ్యలోప నిర్వహణ కూడా సక్రమంగా లేకపోడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారు. నగర పంచాయతీల్లో పల్లెలు కలిసిపోవడంతో మురికి వాడలు కూడా అధికంగానే ఉన్నాయి.
ఈ వాడలను అభివృద్ధి చేయడం ‘నగర పంచాయతీ’లకు సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘రాజీవ్ ఆవాస్ యోజన’ పథకం ఈ నగర పంచాయతీలకు ఓ ఆశాదీపంలా కనిపిస్తోంది. గతంలో 5 లక్షల జనాభా కలిగిన మున్సిపాలిటీలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసే వారు. కానీ ఇపుడు నిబంధనలు మార్చి 35 నుంచి 40 వేల జనాభా కలిగిన కొత్త నగర పంచాయతీలకు కూడా ఈ నిధులు అందించి వాటి అభివృద్ధికి పాటుపడాలనే సంకల్పంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల హైదరాబాద్‌లోని డెరైక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్(డీఎంఏ) కార్యాలయంలో అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీల కమిషనర్‌లతో ప్రత్యేకంగా చర్చించి ఆయా పంచాయతీల్లో అభివృద్ధి చేయాల్సిన మురికివాడలను గుర్తించేందుకు సర్వే చేయాలని ఆదేశించారు. అందుకోసం ఓ ప్రైవేటు ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించారు. పర్యవేక్షణ బాధ్యతలు మాత్రం నగర పంచాయతీ కమిషన్‌కు అప్పగించారు. ప్రస్తుతం సర్వే పనులు ఆయా నగర పంచాయతీల పరిధిలో మురికివాడల గుర్తింపు కార్యక్రమం జరుగుతోంది. సర్వే పూర్తయిన తర్వాత మురికివాడలకు గుర్తింపునకు సంబంధించిన గెజిట్ ప్రచురిస్తారు.
ఆ తర్వాత వాటిని నోటిఫైడ్ మురికివాడలుగా ప్రకటించి, వాటి అభివృద్ధికి తీసుకోవాల్సిన ఇళ్లు, డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు తదితర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపనున్నారు. దీని ప్రకారం ఒక్కో నగర పంచాయతీకి రూ.5 కోట్లకుపైగానే నిధులు మంజూరు కానున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలో 15 మురికివాడలను గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక కమిషనర్ సంతోష్‌కుమార్ ‘న్యూస్‌లైన్’తో వెల్లడించారు. ఈనెల 25లోగా ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశాలు వచ్చిన తరుణంలో ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసే పనిలో తలమునకలై ఉన్నట్లు ఆయన తెలిపారు.
‘వాడ’లకు నిధుల వరద
Published Thu, Jan 16 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement