రాజమండ్రి సిటీ :చారిత్రక రాజమండ్రి నగరాన్ని మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దాలంటే రాజీవ్ ఆవాస్ యోజన పథకం ద్వారా చేపట్టిన సర్వేను అమలు పరచాలని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన రాజమండ్రి ఆనం కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన స్లమ్ ఫ్రీ సిటీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కార్యక్రమంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్య చౌదరి, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి తదితర నాయకులు, సిబ్బందితో సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం ఆర్థిక సహకారంతో మురికవాడల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఏవిధమైన చర్యలు చేపట్టాలనే విషయమై ప్రజాప్రతినిధులతో చర్చించారు.
నగరంలో మురికివాడలను గుర్తించి ఏవిధమైన వసతులు అందించాలనే విషయమై ఆర్వీ అసోసియేట్స్ చేపట్టిన సర్వేను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ప్రదర్శించారు. ఈసందర్బంగా అసోసియేట్స్ అసిస్టెంట్ మేనేజర్ బెజవాడ రఘురామ్ మాట్లాడుతూ నగరంలో 88 మురికివాడల్లో పేదలను సర్వే చేయడం ద్వారా 4200 మందికి ఇళ్లు వేవని గుర్తించామన్నారు. వీరికి 13 ఎకరాల్లో 390 కోట్ల వ్యయంతో జీ ప్లస్ త్రీలో ఇళ్ల నిర్మాణం చేపట్టడం ద్వారా పేదరికం నిర్మూలించే చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దీనిలో 50 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 15 శాతం కార్పొరేషన్, పదిశాతం లబ్ధిదారులు చెల్లించే విధంగా ప్రణాళిక సిద్ధం చేయనున్నట్టు ఆయన తెలిపారు.
ఈ విషయమై సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ నూతన సర్వేలో అంశాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో ఏవిధమైన సమస్యలు తలెత్త్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ పెరిగిన జనాభాను దృష్టిలో ఉంచుకుని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు మరోసారి అందరితో సమావేశమై చర్యలు చేపట్టనున్నట్టు మేయర్ రజనీ శేషసాయి పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, నగర కమిషనర్ రవీంద్రబాబు, వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
‘స్లమ్’స్యలు లేని సిటీగా..
Published Wed, Dec 17 2014 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement