ముదిరిన మిత్రభేదం
సాక్షి, రాజమండ్రి : రాష్ట్ర రాజకీయాల్లో రాజమండ్రి సెంటిమెంట్ బలంగానే ఉంది. అనేక పార్టీలు పలు కీలక కార్యక్రమాలను, ప్రభుత్వాలు పథకాలను ఇక్కడి నుంచే ప్రారంభించిన దాఖలాలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీల స్నేహబంధం విచ్ఛిన్నానికీ ఈ నగరమే శ్రీకారం చుట్టనుందా అన్న అనుమానం తలెత్తుతోంది. ఇక్కడి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో చెరొకటీ గెలుచుకున్న ఆ పార్టీలు ఆది నుంచే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. బీజేపీకి చెందిన సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, టీడీపీకి చెందిన రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిల మధ్య లోపాయకారీగా రగులుతూ వచ్చిన చిచ్చు ఇసుక రీచ్‌ల పుణ్యమా అని ఇప్పుడు ర చ్చకెక్కింది.
ఈ పరిణామాలతో రెండు పార్టీల శ్రేణులూ శత్రువుల్లా మారినట్టు కనిపిస్తోంది. బీజేపీ నేతలు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ‘పట్టణ వ్యవహారాల్లో మీ జోక్యం ఎందుకని’ గోరంట్లను ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యే జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పుష్కరాలు సజావుగా సాగాలంటే కేంద్రం నిధులు ఇవ్వక తప్పదన్నారు. ‘మాకు మెజారిటీ ఉన్నా మిమ్మల్ని కలుపుకొంటున్నాం’ అని గుర్తు చేశారు. కాగా టీడీపీ నేతలు బీజేపీ నాయకుల మాటల్ని తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. గోరంట్ల అనుచరులు ఆయనతో సమాలోచనలు జరుపుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఇరు పార్టీల మధ్య దూరం పెంచుతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
ఇలా మొదలయ్యాయి మిత్రభేదాలు..
సిటీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ గోరంట్ల అధిష్టానం వద్ద పట్టుబట్టి రూరల్ టిక్కెట్ సంపాదించారు. అయితే సిటీపై కూడా పట్టు సాధించాలని ముందు నుంచీ పావులు కదుపుతూనే ఉన్నారు. సిటీ ఎమ్మెల్యేతో పాటు కార్యక్రమాలకు హాజరవుతూ తన చర్యలను సమర్థించుకున్నారు. తాను సిటీ టీడీపీ ఇన్‌చార్జినంటూ నగరపాలక సంస్థ కార్యక్రమాల్లో జోక్యం చేసుకుంటున్నారు. తమ పార్టీ కార్పొరేటర్లతో తరచూ సమావేశమవుతూ సిటీ ప్రాంత పరిపాలనలో కూడా జోక్యం చేసుకుంటుండడం సిటీ ఎమ్మెల్యే ఆకులకు రుచించడంలేదు. పలు సందర్భాల్లో ‘నీకు రాజకీయాలు కొత్త.. నేను సీనియర్‌ను’ అని ప్రజావేదికల వద్ద కూడా ప్రస్తావిస్తుండడం’ అటు బీజేపీ నేతల్లో, ఎమ్మెల్యేలో వ్యతిరేకతకు దారి తీసింది. గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు దివంగత నేతలు జక్కంపూడి రామ్మోహనరావు, ఏసీవై రెడ్డిలతో కూడా గోరంట్ల ఇదే వైఖరి అవలంబించారని, కానీ మిత్రపక్షమైన తమతోనూ ఇదే వైఖరి ఏమిటని నేడు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
కాగా మిత్రపక్ష ఎమ్మెల్యేలు కలిసికట్టుగా రానున్న పుష్కరాలకు నగరాన్ని అభివృద్ధి చేస్తారనుకున్న నగర ప్రజలకు నిరాశే మిగులుతోంది. గతంలో ఏడాది ముందు నుంచి పుష్కర ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు ఇంకా ఏడు నెలలు గడువు లేకపోయినా చేపట్టాల్సిన పనులపై ప్రభుత్వం అంచనాకు కూడా రాలేదు. గోదావరి పుష్కరాలకు అంతా తానై వ్యవహరించాలని చూస్తున్న గోరంట్ల వైఖరి మిత్రభేదాన్ని రానున్న రోజుల్లో మరింత జటిలం చేస్తుందని, ఈ ప్రభావం పుష్కరాలపై పడుతుందని నగర వాసులు నిట్టూరుస్తున్నారు.