నగరంలో చొరబాటు తగునా?
- గోరంట్ల తీరుపై టీడీపీ, బీజేపీల్లో నిరసన
- రూరల్ నుంచి గెలిచాక సిటీలో ఆధిపత్యమేమిటంటున్న నేతలు
సాక్షి, రాజమండ్రి : శాసనసభలో రాజమండ్రి నుంచి చాలా కాలం ప్రాతినిధ్యం వహించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. అనంతరం ఇక్కడి నుంచి వలస వెళ్లాల్సి వచ్చినా నగరంపై పెత్తనం తనదేనంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గం నుంచి గెలిచినా నగరాధిపత్యం తనదేననడం అటు తెలుగుదేశంలోని నగర నాయకులకు, ఇటు సిటీ నియోజకవర్గంలో గెలుపు జెండా ఎగరేసిన మిత్రపక్షమైన బీజేపీ నేతలకు కొరుకుడు పడడం లేదు. రూరల్ ఎమ్మెల్యే అయినా సిటీలోనూ తనదే హవా అనడాన్ని వారు నిరసిస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల అనంతరం తన నియోజక వర్గంలో తొలిసారిగా గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అదేరోజు సాయంత్రం రాజమండ్రి సిటీలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేసి కార్పొరేటర్లను రప్పించుకున్నారు. ‘ఇక నుంచి ఇక్కడ, అక్కడ అంతా నా ఇష్టం. కాదంటే మీకే నష్టం’ అంటూ పరోక్షంగా హెచ్చరించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ సమావేశంలోనూ గోరంట్ల చేసిన వ్యాఖ్యలు వివాదాలకు తెరలేపేవిగా ఉన్నాయి. సిటీ ఎవడబ్బ సొత్తు కాదని, తాను పార్టీలో సీనియర్ గనుక అంటూ, అక్కడా ఇక్కడా తానే పర్యవేక్షిస్తానని స్వపక్షమైన టీడీపీలోని ప్రత్యర్థివర్గానికి, మిత్రపక్షమైన బీజేపీకి సవాలు విసిరినట్టు వ్యాఖ్యానించారు.
గోరంట్ల తీరుతో బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం. గతంలోనూ అధికారిక కార్యక్రమాల్లో కూడా సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణకు పోటీగా గోరంట్ల పాల్గొనడాన్ని వారు నిరసించారు. ఈ నేపథ్యంలో గోరంట్ల తాజా వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో, ఆకుల వర్గీయుల్లో అసంతృప్తికి ఆజ్యం పోశాయి. ఇప్పటికే ‘మీ పార్టీ పరంగా మీరేమైనా చేసుకోండి. అధికారిక కార్యక్రమాల్లో మాత్రం హద్దులు గుర్తించండి’ అంటున్న బీజేపీ నేతలు గోరంట్ల కర్రపెత్తనంపై కన్నెర్ర చేస్తున్నారు.
‘బాబు’ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు : గన్ని
కాగా రాజమండ్రి టీడీపీలో గోరంట్లతో చిరకాలంగా ఉప్పునిప్పులా ఉంటున్న మరో సీనియర్ నేత, పార్టీ అధికార ప్రతినిధి గన్ని కృష్ణ.. రూరల్‌కు వెళ్లినా నగరం తన కనుసన్నల్లోనే ఉండాలన్న ఆయన వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సిటీలో ఇతర నేతలను ఎదగకుండా చేసేందుకే గోరంట్ల ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నారని గన్ని వర్గీయులు ఆరోపిస్తున్నారు. సమావేశాల్లో సిటీ, రూరల్ నియోజక వర్గాల అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావించడం, తాను సీనియర్ నాయకుడినని, రెండు చోట్లా మాట్లాడే హక్కు తనకే ఉందని చెప్పుకోవడం అభ్యంతరకరమంటున్నారు.
గోరంట్ల ‘నేనొక్కడినే’ అన్నట్టు.. కార్పొరేటర్లు, ఇతర నేతల వద్ద వ్యాఖ్యానించడం పట్ల గన్ని ఆగ్రహంగా ఉన్నారు. గోరంట్ల తీరుపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. శాసనమండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు శుక్రవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి హాజరైన గన్ని కొందరు నేతలు ముందు టిక్కెట్ ఇవ్వలేదని, తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడినే బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ సమావేశానికి గోరంట్ల హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది.