♦ అమలాపురంలో రచ్చకెక్కిన మిత్రభేదం
♦ టీడీపీ అవినీతిపై ధ్వజమెత్తిన బీజేపీ
♦ అభివృద్ధి నిరోధకులని ‘దేశం’ ప్రత్యారోపణ
♦ ఆర్డీఓ కార్యాలయం వద్ద పోటాపోటీ ధర్నాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ఓ వైపు ఆదివారం స్నేహితుల దినోత్సవం జరగనుండగా అంతకు ఓ రోజు ముందే మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీలు అమలాపురంలో కత్తులు దూసుకున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీనీ అధికారంలోకి వచ్చే వ్యూహంతోనే ఈ రెండు పార్టీలూ మిత్రపక్షాలయ్యాయి. అటువంటి పక్షాల మధ్య జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో విభేదాలు రగులుకున్నారుు. తాజాగా కోనసీమ కేంద్రం అమలాపురంలో రెండు పార్టీల నేతలు ‘బస్తీ మే సవాల్’ అంటూ జబ్బలు చరుచుకుని రోడ్డెక్కాయి. మిత్రపక్షాలకు చెందిన రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆకుల సత్యనారాయణ (బీజేపీ), గోరంట్ల బుచ్చయ్యచౌదరి (టీడీపీ)ల మధ్య నిన్నమొన్నటి వరకు పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే పరిస్థితి.
పుష్కరాల్లో సైతం వీరి మధ్య అంతరం తగ్గలేదు. బీజేపీకే చెందిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా పుష్కరాల పనుల్లో అవినీతి జరిగిందని నిప్పులు చెరిగింది టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీల పైనేనంటున్నారు. రాజమండ్రిలో టీడీపీ, బీజేపీల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు అమలాపురాన్ని తాకాయి. బీజేపీ నేతలు నేరుగా అక్కడి టీడీపీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుపై అవినీతి అస్త్రాలు సంధించడమే కాక శనివారం ధర్నా కూడా చేపట్టారు. ఇందుకు పోటీగా టీడీపీ నేతలు కూడా ధర్నాకు దిగారు. చాలా కాలం నుంచే అంతర్గత పోరు అల్లవరం మండలం ఓడలరేవులో ఓఎన్జీసీ ప్లాంట్ విస్తరణ కోసం300 ఎకరాల భూ సేకరణలో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారనేది బీజేపీ ప్రధాన ఆరోపణ.
ఇందులో ప్రధాన పాత్ర అధికారపార్టీకి చెందిన అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుదేనంటోంది. ఆయనను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు కూడా చేశారు. అల్లవరం మండలానికి చెందిన రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబుకు, ఎమ్మెల్యే ఆనందరావుకు మధ్య అంతర్గత పోరు చాలా కాలంగా కొనసాగుతున్నా ఇప్పుడు రెండు పక్షాలు అధికారంలో ఉండటంతో తారాస్థాయికి చేరుకుంది. గతంలో అల్లవరం మండలంలో ఫ్లెక్సీల ఏర్పాటు విషయమై తలెత్తిన వివాదానికి ఓఎన్జీసీ భూ సేకరణపై అవినీతి ఆరోపణలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది.
అవినీతిపై విచారణకు డిమాండ్
అల్లవరం మండలంలో ఇటీవల జరిగిన పుష్కర ఘాట్ల నిర్మాణంలో అవినీతికి కూడా ఎమ్మెల్యే ఆనందరావే కారణమని బీజేపీ నేతలు ఆరోపించారు. అవినీతిని నిరసిస్తూ వారు ఆర్డీఓ కార్యాలయం వద్ద శనివారం ఉదయం, వారికి పోటీగా టీడీపీ నాయకులు సాయంత్రం ధర్నాలకు ఉపక్రమించారు. అవినీతికి సం బంధించి అధిపార పార్టీ నాయకుల పైనా, వారికి అండగా నిలిచిన అధికారులపైనా విచారణ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.
దొరబాబుతో పాటు రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా వంటి నాయకులు ఆందోళనలో ముందుండటం గమనార్హం. టీడీపీ కూడా హడావిడిగా ప్రతి ఆందోళనకు దిగి కమలనాథులకు సవాల్ విసిరింది. ఆర్డీవో కార్యాలయం వద్ద పోటీ ధర్నా చేపట్టి ఎమ్మెల్యేపై బీజేపీ నాయకుల ఆరోపణలను ఖండించింది. నియోజవర్గ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించింది. బీజేపీ నాయకులవి దళిత వ్యతిరేక విధానాలని నిరసించింది. మిత్రపక్షాల మధ్య రగిలిన విభేదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఏ పరిణామానికి దారి తీస్తాయో వేచి చూడాల్సిందే.
దోస్తీ మే సవాల్!
Published Sun, Aug 2 2015 2:42 AM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM
Advertisement
Advertisement