బీజేపీ ఇలాకాలో టీడీపీ పెత్తనం | Gorantla's 'double act' irks BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ ఇలాకాలో టీడీపీ పెత్తనం

Published Wed, Jul 16 2014 2:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీ ఇలాకాలో టీడీపీ పెత్తనం - Sakshi

బీజేపీ ఇలాకాలో టీడీపీ పెత్తనం

 సాక్షి,  రాజమండ్రి : టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యవహారశైలి పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. తాను గెలిచిన రూరల్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేసి, బీజేపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో కర్ర పెత్తనం చేయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఈయన ధోరణి అటు సొంత పార్టీలో నేత ల్లోనే కాక ఇటు మిత్రపక్షమైన బీజేపీ నాయకుల ఆగ్రహానికి కారణమౌతోంది. బుచ్చయ్య వ్యవహారశైలి మిత్రపక్షాల మధ్య విభేదాలకు దారి తీసేలా ఉంది.
 
 పట్టుకోసం పాట్లు : ఎన్నికల్లో చివరి క్షణం వరకూ రాజమండ్రి అర్బన్ టీడీపీ  టిక్కెట్ కోసం  ప్రయత్నించిన గోరంట్లకు చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా సీట్ల కేటాయింపులో 175వ అభ్యర్థిగా చంద్రబాబునాయుడు రాజమండ్రి రూరల్ టిక్కెట్‌ను ఖరారు చేశారు. బీజేపీని రూరల్‌కు పంపి తాను అర్బన్‌లో పాగా వేయాలని చేసిన ప్రయత్నాలను బీజేపీ నాయకులు తిప్పి కొట్టగలిగారు. ప్రత్యేక పరిస్థితుల్లో బుచ్చయ్యను విజయం వరించినా తన ధ్యాస అంతా సిటీపైనే ఉండడంతో సీనియర్ నేత హోదాతో పార్టీని గుప్పెట పెట్టుకున్న గోరంట్ల.. అధికారిక కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకుంటూ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. ఈ పరిణామం నగర బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. అంతేకాకుండా నగరంలో పార్టీ వర్గాల్లో కూడా ఈయన వ్యవహారశైలి చర్చనీయాంశమైంది.
 
 బీజేపీ ఇలాకాలో టీడీపీ పెత్తనం
 వచ్చే ఏడాది జరుగనున్న పుష్కరాల  నిమిత్తం చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల్లో బీజేపీ నేతలు తమదైన ముద్ర ఉండేలా చూసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఆ పార్టీ నేతల ఆశలపై బుచ్చయ్య నీళ్లు జల్లుతుండడం సిటీ ఎమ్మెల్యే  ఆకుల సత్యనారాయణకు రుచించడం లేదని తెలుస్తోంది. గత నెల ఎమ్మెల్యేగా పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం బుచ్చయ్యచౌదరి.. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను వెంట పెట్టుకుని సిటీ పరిధిలోని డివిజన్‌లలో అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించారు. ఆ వెంటనే వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను తన ఇంటికి రప్పించుకుని సమీక్షలు నిర్వహించారు. ఈ నెల ఆరో తేదీన రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద వెటర్నరీ ఆస్పత్రిలో జరిగిన జూనోసిస్‌డే కార్యక్రమాలకు గోరంట్ల హాజరయ్యారు.
 
 ఆస్పత్రిలో పశువుల ఎక్స్‌రే మిషన్ ప్రారంభించారు. అదేరోజున పట్టణ రజక సేవాసంఘం మేయర్ పంతం రజనీ శేషసాయిని సన్మానించింది. ఈ కార్యక్రమానికి హాజరైన గోరంట్ల నగరాభివృద్ధిపై పలు వాగ్దానాలు గుప్పించారు. వారం రోజుల క్రితం జరిగిన దక్షిణ మధ్యరైల్వే జీఎం శ్రీవాత్సవ పర్యటన సందర్భంగా రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో తన కంటే ముందుగా ఆకుల మాట్లాడడాన్ని జీర్ణించుకోలేకపోయిన బుచ్చయ్యచౌదరి.. ఆ తర్వాత  మరోసారి మాట్లాడడానికి యత్నించినసిటీ ఎమ్మెల్యేకు  మైకును ఇవ్వకుండా తన వద్దే ఉంచేసుకున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో డివిజన్‌లు తొమ్మిది మాత్రమే ఉన్నప్పటికీ రాజమండ్రి నగర మేయర్ స్థానాన్ని టీడీపీ దక్కించుకోవడంతో కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాల్లో పూర్తిగా జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వివస్తున్నాయి.
 
 సిటీ ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన వారు కావడంతో రానున్న రోజుల్లో కార్పొరేషన్‌లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు తన కనుసన్నల్లో జరిగే విధంగా వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. కాగా నగరపాలనలో బుచ్చయ్య జోక్యం వ్యవహారం రెండు పార్టీల అధినాయత్వం దగ్గర ఇప్పటికే నలుగుతోందని తెలియవచ్చింది. ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి అధికారిక కార్యక్రమాల్లో కూడా బుచ్చయ్య పాల్గొంటుండడంపై ఆకుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. ఇదే విషయంలో నాలుగు రోజులుగా వీరిరువురి మధ్య భేదాభిప్రాయాలు పొడచూపినట్టు తెలుస్తోంది. సిటీలో జరిగే కార్యక్రమాలకు గోరంట్ల హాజరవుతుండడం, చుట్టూ ఆయన వర్గం టీడీపీ నేతలు మోహరిస్తుండడంతో తమకు తగిన ప్రాధాన్యం లభించడం లేదని బీజేపీ కార్యకర్తలు తమ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారని విశ్వసనీయ సమాచారం.
 
 సొంతగూటిలోనూ
 పుష్కరాల్లో కర్రపెత్తనం చేసేందుకు టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి అత్యుత్సాహం చూపుతున్నారని టీడీపీలో పార్టీ మరో కీలక నేత గన్ని కృష్ణ వర్గం గుర్రుగా ఉంది. ‘ఇప్పటికైనా పార్టీలో ఇతర నేతలకు ప్రాధాన్యం లభిస్తుందని భావించాం. కానీ బయటకు పంపినా ఇక్కడే ఆయన ఆధిపత్యం చలాయించడం మాకు నచ్చడంలేదు.’అని ఓ సీనియర్ నేత స్వయంగా వ్యాఖ్యానించడం పార్టీలో బుచ్చయ్య కర్రపెత్తనం పెడుతున్న చిచ్చును సూచిస్తోంది. ఇప్పటికే సిటీ వ్యవహారాల్లో గోరంట్ల చేసుకుంటున్న జోక్యం బీజేపీ నేతల్లో కూడా అసంతృప్తికి గురి చేస్తోంది. గోరంట్ల తన రూరల్ నియోజక వర్గ అభివృద్ధిని పక్కనబెట్టి అర్బన్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణను డామినేట్ చేసి సిటీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని ఓ బీజేపీ నేత వ్యాఖ్యానించారు. ఇప్పటికే బుచ్చయ్య పెత్తనంపై నగరంలో చర్చలు సాగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఇరు పార్టీల్లో తలెత్తిన భేదాభిప్రాయాలు రోడ్డున పడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement