రేపటి నుంచి కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈనెల 27న ప్రారంభించనున్న సభ్యత్వ నమోదును డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగించనుంది. సాధారణ, ఉప ఎన్నికల ఫలితాలతో డీలా పడిన కాంగ్రెస్ పెద్దలు సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా పార్టీకి ఉన్న బలాన్ని అంచనా వేయాలని భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గతంలో నిర్వహించిన నమోదు సందర్భంగా 36 లక్షల మంది కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోగా, అందులో 15 లక్షలకుపైగా తెలంగాణకు చెందిన వారేకావడం గవునార్హం. ఈసారి ఆ స్థాయిలో సభ్యత్వ నమోదు సాధ్యవువుతుందా? లేదా? అని పార్టీ పెద్దల్లోనే అనుమానాలున్నాయి. అందుకే ఈసారి ఎంతమందిని సభ్యులుగా చేర్చాలనేది కూడా వారు చెప్పలేకపోతున్నారు.
ఆశించిన స్థాయిలో సభ్యులు నమోదు కానిపక్షంలో పార్టీ పనైపోయిందనే సంకేతాలు వెళతాయనే ఆందోళనలో ఉన్న నేతలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్ సహా పార్టీ అనుబంధ సంఘాలన్నింటినీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని నిర్ణయించారు. మార్చి 15 నాటికి సభ్యుల తుది జాబితాను ప్రకటించడంతోపాటు ఏప్రిల్ మొదటివారం నుంచి సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకు బూత్, బ్లాక్ కమిటీ, జూన్ 7 నుంచి 27 వరకు డీసీసీ కార్యవర్గ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే జూలై 5 నుంచి 25 వరకు పీసీసీ అధ్యక్ష, కార్యవర్గ సభ్యులు, ఏఐసీసీ సభ్యుల ఎన్నిక జరుగుతుందని, ఆ తరువాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తామని వివరించారు. సభ్యత్వ నమోదును పల్లెపల్లెలో పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. శ్రేణులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ సభ్యత్వ నమోదు సాగేనా?
Published Fri, Sep 26 2014 1:08 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement