మే 1న రాత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టెట్ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ వెబ్‌సైట్ (http://tstet.cgg.gov.in) ద్వారా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,72,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని... అందులో పేపర్-1కు 99,993 మంది, పేపర్-2కు 2,72,137 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అత్యధికంగా 64,030 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆదిలాబాద్ జిల్లా నుంచి తక్కువగా 15,413 మంది ఈ పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. మే 1న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వివరించారు. మే 10 లేదా 11న ఫలితాలను ప్రకటించే అవకాశముంది.
వివరాలు సరిచూసుకోండి..
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తరువాత అభ్యర్థులు అందులోని వివరాలను సరిచూసుకోవాలి. అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ, కులం, జెండర్, వైకల్యం లాంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా, లేదా పరిశీలించాలి. పొరపాట్లు దొర్లితే పరీక్షహాల్లో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీ జాబితాలో వాటిని సరి చేయించుకోవాలి. ఫొటో, అభ్యర్థి హాజరయ్యే పేపర్, లాంగ్వేజ్-1 వంటి వివరాలు సరిగా లేకపోతే... వాటిని సరి చేసుకునేందుకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో టెట్ సెల్‌ను ఈనెల 25 నుంచి 29 మధ్య సరైన ఆధారాలతో సంప్రదించాలి. హాల్‌టికెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో ముద్రించి ఉన్న ఫొటో కింద అలాంటి ఫొటోనే అతికించి సంతకం చేయాలి. పరీక్ష సందర్భంగా పైభాగాన్ని అభ్యర్థి తన వద్ద ఉంచుకుని, కింది భాగాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.
నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
Published Wed, Apr 20 2016 2:22 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM
Advertisement