హైదరాబాద్: వరుస సంఘటనలు చోటుచేసుకుంటున్నా గాంధీ అసుపత్రి సిబ్బందిని నిర్లక్ష్యం వీడటం లేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారుకు కాలం చెల్లిన ఇంజక్షన్లు ఇవ్వడంతో 10 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఐసీయూకు తరలించి చికిత్స అందించారు.
సిబ్బంది నిర్లక్ష్యంపై చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంజెక్షన్‌లు ఇచ్చిన అనంతరం చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మందులను పరిశీలించగా అవి కాలం చెల్లినవి అని తేలింది. ఆసుపత్రి సిబ్బంది తమ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ప్రయత్నించారని, కాలం చెల్లిన మందులను చెత్తబుట్టలో వేసి గుట్టుచప్పుడు కాకుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కోలుకుంటున్న చిన్నారులు ఇంజిక్షన్‌ల మూలంగా తీవ్ర అస్వస్థతకు గురికావడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.