ఈడీ కేసు సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదిలీ..
♦ జగతి, విజయసాయిరెడ్డి పిటిషన్ల అనుమతి
♦ హైకోర్టు ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్‌లో రూ.34.65 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి(ఎంఎస్‌జే) కోర్టు నుంచి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎంఎస్‌జే కోర్టులో జరుగుతున్న ఈడీ కేసు విచారణను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసుకున్న పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.
జగతి పబ్లికేషన్స్‌లో ఎ.కె.దండమూడి, టి.ఆర్.కన్నన్, మాధవ్ రామచంద్రన్‌లు పెట్టిన పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసు నమోదు చేసి చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. అలాగే ఈడీ కూడా కేసు నమోదు చేయగా.. దీనిపై ఎంఎస్‌జే కోర్టు విచారణ జరుపుతోంది. ఒకే అంశానికి సంబంధించి రెండు కోర్టులు వేర్వేరుగా విచారణ జరపడం వల్ల తమకు నష్టం జరుగుతుందని, అందువల్ల ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలంటూ జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. జగతిలో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ కేసును ఎంఎస్‌జే కోర్టుకు బదిలీ చేయాలన్న ఈడీ అభ్యర్థనను సీబీఐ కోర్ట్టు తిరస్కరించిందన్నారు.
ఈడీ కేసుల్ని విచారించే పరిధిని సీబీఐ కోర్టుకు కల్పిస్తూ ఇటీవల కేంద్రం జారీచేసిన ఉత్తర్వుల్ని న్యాయస్థానం దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఈడీ కేసును సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేసేందుకు తమకు ఎలాం టి అభ్యంతరం లేదని ఈడీ తరఫు న్యాయవాది పి.ఎస్.పి.సురేష్‌కుమార్ తెలిపారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసునూ విచారించేలా సీబీఐ కోర్టును ఆదేశించాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎంఎస్‌జే కోర్టులో ఉన్న ఈడీ కేసును సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అయితే సీబీఐ కేసుతోపాటు ఈడీ కేసును కూడా విచారించాలని ఆదేశాలివ్వడం సాధ్యం కాదని, దీనిపై సీబీఐ కోర్టే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.