సీనియర్ జర్నలిస్టు అరుణ్‌సాగర్ మృతి
♦ గుండెపోటుతో హఠాన్మరణం
♦ గవర్నర్, కేసీఆర్, బాబు, వైఎస్ జగన్ తదితరుల సంతాపం
♦ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, కవి, రచయిత, టీవీ5 ఎడిటర్ అరుణ్‌సాగర్ (49) గుండెపోటుతో మరణించారు. కొద్ది నెలలుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం హఠాత్తుగా గుండెపోటు రావడంతో హైదరాబాద్ అమీర్‌పేటలోని ఓ హాస్పిటల్‌లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రసన్న, కుమార్తె స్రిత ఉన్నారు. అరుణ్‌సాగర్ ఆకస్మిక మృతి పట్ల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం కె.చంద్రశేఖరరావు, ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్ సహా పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పత్రికా రంగంతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అరుణ్‌సాగర్ అందించిన సేవలను కొనియాడారు. బంధుమిత్రులు, జర్నలిస్టు మిత్రుల అశ్రునయనాల మధ్య హైదరాబాద్ రాయదుర్గంలోని మహాప్రస్థానం విద్యుత్ శ్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, సినీ నటుడు తనికెళ్ల భరణి, ప్రజా గాయకుడు గోరటి వెంకన్న, గద్దర్, పలువురు సీనియర్ జర్నలిస్టులు తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అంతకుముందు అరుణ్‌సాగర్ భౌతికకాయానికి మోతీనగర్‌లోని ఆయన నివాసంలో మంత్రులు కేటీఆర్, హరీశ్, తుమ్మల నాగేశ్వరరావు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి, జర్నలిస్టు నేతలు తెలకపల్లి రవి, కె.శ్రీనివాస రెడ్డి, దేవులపల్లి అమర్, విరాహత్ అలీ తదితరులు నివాళులర్పించారు. అరుణ్‌సాగర్ ఎన్నో చక్కని రచనలు చేయడమే గాక జర్నలిజంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. మేల్‌కొలుపు, మాగ్జిమం రిస్క్ వంటి రచనలు, కవితలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారన్నారు. అరుణ్‌సాగర్ అకాల మరణంపై సీపీఎం సంతాపం ప్రకటించింది. వామపక్ష విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన, జర్నలిజంలో ప్రజాస్వామ్య, అభ్యుదయ భావాలకు అంకితమై పనిచేశారంది. అరుణ్‌సాగర్ అంత్యక్రియల నిమిత్తం తక్షణ సాయం కింద రూ.50 వేలను కేసీఆర్ విడుదల చేశారు. మరోవైపు, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం అధ్యక్షునిగా పని చేసిన ఎం.ఎల్.నరసింహారావు మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు.