ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అరాచకం
♦ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ధ్వజం
♦ జిల్లాల టీఆర్‌ఎస్ నేతలు ఇక్కడే తిష్ట వేశారు
♦ అధికార పార్టీకి తొత్తుల్లా పోలీసులు, అధికారులు
♦ అడ్డుకోవాలని గవర్నర్‌కు వినతి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని డబ్బులు, మద్యం పంచుతూ టీఆర్‌ఎస్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇతర పార్టీల నేతలను బెదిరిస్తూ, దాడులు చేస్తూ అధికార పార్టీ అరాచకంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్ ప్రభాకర్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు సోమవారమిక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
జిల్లాల నుంచి వచ్చిన టీఆర్‌ఎస్ నేతల అరాచకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ ఎమ్మెల్యే ప్రభాకర్‌పై, కార్యకర్తలపై దాడికి దిగడమే కాకుండా ఎదురుకేసులు పెట్టారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతల అక్రమాలను పోలీసులు, అధికారుల దృష్టికి తీసుకుపోయినా ధృతరాష్ట్రుల్లాగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవాచేశారు. ప్రచారం గడువు ముగిసినా జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలను హైదరాబాద్ నుంచి తిరిగి ఎందుకు పంపలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కె.లక్ష్మణ్ మాట్లాడుతూ, ఎన్నికల కోడ్‌ను టీఆర్‌ఎస్ ఇష్టారాజ్యంగా ఉల్లంఘిస్తోందని, అధికారులు కూడా టీఆర్‌ఎస్‌కే వంతపాడుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్‌కు వస్తున్న సింగూరు నీటిని సిద్దిపేటకు తరలించిన కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. పాతబస్తీలో ఎంఐఎంకు అనుకూలంగా బీజేపీ నేతలపై పోలీసులు కేసులు పెడుతూ, భయపెడుతున్నారని ఆరోపించారు. ఎంఐఎం కబంధహస్తాల నుంచి హైదరాబాద్‌ను కాపాడాలంటే బీజేపీని గెలిపించడం ఒక్కటే మార్గమన్నారు. ప్రభాకర్ మాట్లాడుతూ, డబ్బులు పంచుతున్న టీఆర్‌ఎస్ నేతలను పట్టిస్తే తనపైనే అక్రమకేసులు పెట్టారని, ఎన్నికలను స్వేచ్ఛగా నిర్వహించడానికి ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. టీఆర్‌ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారంటూ ఆ వీడియోలను రామచందర్‌రావు మీడియాకు ప్రదర్శించారు.
గవర్నర్ ఫిర్యాదు
ఎన్నికల్లో అధికారపార్టీ చేస్తున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్‌కు బీజేపీ నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. కిషన్‌రెడ్డి, కె.లక్ష్మణ్, ఎన్.రామచందర్‌రావు, ఎన్‌వీఎస్ ప్రభాకర్, జి.ప్రేమేందర్ రెడ్డి, చింతా సాంబమూర్తి తదితరులు సోమవారం గవర్నర్‌ను కలిశారు. ఇతర జిల్లాలకు చెందిన టీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో తిష్టవేసి, ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఓటర్ల స్లిప్పులను అందించడానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేయాలని కోరారు.