సెంచరీ కొడతాం
* గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై మంత్రుల ధీమా
* టీఆర్‌ఎస్ బహిరంగ సభలో ఉత్సాహభరిత ప్రసంగాలు
* 100 స్థానాల్లో విజయం ఖాయమని వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు గుర్తు వంద సీట్లు గెలవబోతోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శనివారం పరేడ్‌గ్రౌండ్స్ మైదానంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభ వేదిక మీద నుంచి ఆయన మాట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు.
గ్రేటర్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు, మురికి వాడలు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు అహ ర్నిషలు కృషిచేస్తున్నారని చెప్పారు. గ్రేటర్‌లో 1.08 లక్షలమంది పేదలకు పట్టాలిచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. పట్టుదల, సంకల్పబలం ఉన్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నగరంలో ఉన్న ఎస్సీ,ఎస్టీ, బీసీల జీవితాల్లో వెలుగులు నింపేందుకు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. నగరానికి కృష్ణా, గోదావరి జలాల తరలింపు, 24 గంటల కరెంటు సరఫరా ఇచ్చారని గుర్తుచేశారు. ఇవేవీ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు.
టీఆర్‌ఎస్‌తోనే నగరాభివృద్ధి: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
బల్దియా పీఠంపై టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగిరితేనే నగరం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రస్తుతం నిధులు, విధులు, అధికారాలున్న పార్టీ టీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పేదలకు రూపాయికి కిలోబియ్యం, ఆసరా పింఛన్లు అమలు చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. తెలంగాణా మహాత్మ కేసీఆర్ ఆధ్వర్యంలోనే నగరం దేశంలో నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. విశ్వనగరం ఒక్క టీఆర్‌ఎస్‌కే సాధ్యమన్నారు. తప్పకుండా మెజార్టీ స్థానాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గులాబీ జెండా దూసుకుపోతోంది: మంత్రి తలసాని
గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా విజయం వైపు దూసుకుపోతోందని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేసీఆర్ సంకల్పబలంతో చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాయన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నేడు విజన్ ఉన్న సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టి నగరంలో సమస్యల పరిష్కారానికి కృషిచేశారన్నారు.
హుస్సేన్‌సాగర్, మూసీ నదులను కాలుష్య కాసారంగా మార్చిన ఘనత విపక్షాలదేనని విమర్శించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి కేంద్రం సహకారం అందిస్తోందని చెప్పిన బీజేపీ నేతలు...బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. జైళ్లకు వెళ్లొచ్చిన కొందరు ఛోటా నేతలు కేసీఆర్‌ను విమర్శిస్తున్నారన్నారు. గత పాలకుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఒక్కరు చాలన్నారు.
ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుంటాం: మైనంపల్లి హన్మంతరావు
తెలంగాణా రాష్ట్రం సాధించగానే ఇతర ప్రాంతాల వారిని ఇక్కడ నుంచి పంపిస్తారని విపక్షాలు దుష్ర్పచారం చేశాయని గ్రేటర్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మైనంపల్లి హన్మంతరావు అన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర ప్రాంతాల వారిని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా హైదరాబాదీయులే. రెండు రాష్ట్రాలు ఏర్పడడంతోనే ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈవిషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని మైనంపల్లి విజ్ఞప్తి చేశారు.
సైడ్‌లైట్స్
⇒ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మూడు వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై సీఎం సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఆశీనులు కాగా, మధ్యలో ఏర్పాటు చేసిన రెండో వేదికపై గ్రేటర్ టీఆర్‌ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులకు కేటాయించారు. మూడో వేదిక కళాకారులకు కేటాయించారు.
⇒ సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సిన టీఆర్‌ఎస్ సభ సాయంత్రం 5.30 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం సుమారు గంటన్నర పాటు తమ ఆటాపాటలతో సభికులను ఉర్రూతలూగించారు.
⇒ ‘దేఖో హైదరాబాద్... అందమైన సికింద్రాబాద్’ అంటూ హైదరాబాద్ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట అందరినీ ఉత్సాహ పరిచింది. బోనాల జాతర గొప్పతనాన్ని వివరిస్తూ ‘రామా రామా ఎల్లమ్మలో...’ అంటూ పాడిన పాటకు సభకు హాజరైన మహిళలు, చిన్నారులు ఉత్సాహంతో చిందేశారు. కొంతమంది పూనకంతో శివసత్తులు ఆడారు. ‘వీర తెలంగాణమా.. తిరుగబడ్డ గానమా...,ఉస్మానియా క్యాంపస్‌లో ఉదయించిన కిరణమా...’వంటి పాటలు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాయి.
⇒ సభా ప్రాంగణానికి నాలుగు వైపులా కారు బెలూన్లను గాల్లో ఎగరేశారు. అవి సభికులను ఆకర్షించాయి.
⇒ ఎంపీ బాల్కా సుమన్ సభకు సమన్వయకర్తగా వ్యవహరించారు. పరేడ్‌గ్రౌండ్ బయట ఉన్న కార్యకర్తలను లోనికి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఆయన పదేపదే విజ్ఞప్తి చేయడం కన్పించింది. కార్యకర్తలను అడ్డుకోవద్దని పదేపదే పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
⇒ పాతబస్తీ నుంచి వచ్చిన ఓ అభిమాని టీఆర్‌ఎస్ పార్టీ, కారు గుర్తు, కేసీఆర్ ఫొటోతో తయారు చేసిన హెల్మెట్‌ను తలకు ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. రాత్రి 7.55 నిమిషాలకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ సీఎం కేసీఆర్ సభా వేదికపైకి వస్తున్న సమయంలో మరో అభిమాని శంఖం పూరించి ఎన్నికల సమరానికి సిద్ధం అంటూ ప్రకటించాడు.
⇒ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘ఏపీ సీఎం చంద్రబాబు దగ్గర ఏమున్నది? నెత్తున్నదా...? కత్తిన్నదా..? ఆయనకు ఓటేస్తే హైదరాబాద్‌కు ఏమీ చేయలేడు’ అని చెప్పడంతో వేదికపై ఆశీనులైన సభికులతో పాటు అభిమానులు, కార్యకర్తలు ఘొల్లున నవ్వుకున్నారు.