గగనంలో ఎం‘జాయ్’
హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చారిత్రక ప్రాధాన్యమున్న హైదరాబాద్ మహా నగరంలో పర్యాటకానికి కొత్త హంగులద్దుతూ హెలీ టూరిజంను ప్రారంభిస్తున్నాం. విశ్వనగరంగా అభివృద్ధి వైపు అడుగులేస్తున్న తరుణంలో తెలంగాణ పర్యాటక శాఖ ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది’ అని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. హుస్సేన్‌సాగర తీరంలోని నెక్లెస్‌రోడ్‌లో తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని ‘హెలికాప్టర్ జాయ్ రైడ్స్’ను మంగళవారం మంత్రులు కేటీఆర్, చందూలాల్ ప్రారంభించారు. కేటీఆర్ మాట్లాడుతూ... విమానయానం సంపన్నులకు సంబంధించిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
అయితే.. తెలంగాణ పర్యాటక శాఖ సామాన్యులకు సైతం రూ.3,499కే హైదరాబాద్ గగన యానం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కోటి జనాభాకు పైగా ఉన్న నగరంలో పర్యాటకాన్ని ఇంకా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రధానంగా ఔటర్ రింగ్‌రోడ్డు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్, మూసీ నది సుందరీకరణ చేయడం ద్వారా నగరాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళికలు మా వద్ద ఉన్నాయి. హుస్సేన్‌సాగర్ తీరంలో 95 ఎకరాల్లో ఉన్న సంజీవయ్య పార్కును మరింత సుందరంగా తీర్చిదిద్దుతాం’ అన్నారు.
భవిష్యత్‌లో యాదాద్రి, మేడారం...
‘భాగ్యనగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ కలలుగంటున్న తరుణంలో హెలీ టూ రిజాన్ని ప్రారంభిస్తున్నాం. నగరం అనతికాలంలోనే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటం ఖాయం. భవిష్యత్‌లో హెలీ టూరిజం ద్వారా యాదాద్రి, లక్కవరం చెరువు, మేడారం, వరంగల్, నాగార్జునసాగర్, కరీంనగర్ తదితర ప్రాంతాలు చూసేందుకు అవకాశం కల్పిస్తాం’ అని పర్యాటక శాఖమంత్రి చందూలాల్ చెప్పారు. ఇద్దరు సందర్శకులకు జాయ్ రైడ్ టికెట్లను కేటీఆర్ చేతుల మీదుగా అందించారు. అనంతరం కేటీఆర్, చందూలాల్, మేయర్ బొంతు రామ్మోహన్ హెలికాప్టర్లో ట్రయల్ రన్ వేశారు. హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయాలనుకొనే వారు క్ఛట్చ్ఛఠ్ఛ్టిట.ఛిౌఝలోగానీ, 9868827777 నంబర్లో గానీ సంప్రదించాలని హెలీ టూరిజం నిర్వాహకులు తెలిపారు. పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, టూరిజం ఎండీ క్రిస్టినా, ప్రభుత్వ సలహాదారు పాపారావు, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.