ఏపీలో ఇతిహాద్ ఎయిర్ వేస్ | Etihad Airways Starts service to andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇతిహాద్ ఎయిర్ వేస్

Published Mon, Jun 27 2016 7:28 PM | Last Updated on Sat, Jul 28 2018 7:54 PM

ఏపీలో ఇతిహాద్ ఎయిర్ వేస్ - Sakshi

ఏపీలో ఇతిహాద్ ఎయిర్ వేస్

టియాంజిన్, జూన్ 27: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి స్వరాష్ట్రానికి చేరుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. సమీప భవిష్యత్తులో ఏపీ వచ్చే ప్రయాణీకులు శంషాబాద్ రాకుండానే నేరుగా విజయవాడ, విశాఖ, తిరుపతి చేరుకోవచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ విమానయాన సంస్థ ఇతిహాద్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామితో ముఖాముఖి భేటీ అయ్యారు. విజయవాడ, విశాఖ, తిరుపతి నుంచి నేరుగా విదేశాలకు వెళ్లే సదుపాయం కల్పించటానికి  ఇతిహాద్ ఎయిర్‌వేస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ పూనోసామి అంగీకరించారు. ఇందుకోసం పౌరవిమానయాన శాఖకు అనుమతులు కోరతామని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పారు.

ఆక్సియోనా కంపెనీ పునరుత్పాదక విద్యుత్ కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి స్పెయిన్‌కు చెందిన ‘ఆక్సియోనా ఎనర్జీ’ ముందుకు వచ్చింది. సోమవారం టియాంజిన్ లో ప్రపంచ ఆర్ధిక వేదిక సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ టెక్నలాజికల్ హెడ్ జాక్విన్ ఎనిన్‌తో సమావేశమయ్యారు. ఎలిన్ మాట్లాడుతూ తమ కంపెనీ ఏపీలో 200 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది జూన్ నాటికి విద్యుత్ కేంద్రం నెలకొల్పుతామన్నారు. 

వచ్చే ఏడాది ప్రథమార్ధంలో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని,  2018-19 సంవత్సరాల్లో మరో 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబుకు చెప్పారు.  ‘ప్రపంచంలోనే తొలి భారీ సౌర విద్యుత్ కేంద్రంగా ప్రాచుర్యం పొందిన ‘నెవడా సోలార్ వన్’ నిర్మాణంలో  ‘ఆక్సియోనా ఎనర్జీ’ కీలకపాత్ర పోషించింది. 2007 తర్వాత ఆక్సియోనా ఎనర్జీ కంపెనీ 9 దేశాల్లో 164 దేశాల్లో 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన 164 పవన విద్యుత్ కేంద్రాలు నిర్మించింది.

ఏపీలో విద్యుత్ రంగానికి టోటల్ ఎస్.ఏ చేయూత
 ఆంధ్రప్రదేశ్‌ ఇంధన రంగాన్ని అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందిస్తామని టోటల్ ఎస్.ఏ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జీరోమ్ స్మిట్  (Jerome Schmitt) ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తీసుకొచ్చి విద్యుత్ వినియోగాన్ని తగ్గించటంలో తాము తోడ్పడతామన్నారు. టోటల్ ఎస్.ఎ కంపెనీ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న జీరోమ్ స్మిట్ గతంలో విదేశాల్లో ఆ కంపెనీకి ఉన్న  వివిధ విభాగాల్లో సేవలందించారు.

సీఎంతో డాన్ఫోస్ గ్రూప్ చైర్మన్ జోర్జన్ మాడ్స్ క్లాసన్ భేటీ

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో డాన్ఫోస్ గ్రూప్ చైర్మన్ జోర్జన్ మాడ్స్ క్లాసన్  భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి కర్మాగారాలను ఏర్పాటుపై, మెగా కోల్డ్ చెయిన్ ప్రాజెక్టుల స్థాపనకు సంసిద్ధత తెలియజేశారు.  డాన్ఫోస్ గ్రూప్ ఆహార శీతలీకరణ, ఎయిర్ కండిషనింగ్, హీట్ బిల్టింగ్స్, ఎలక్ట్రిక్ మోటార్లు, కంప్రెసర్లు, డ్రైవ్స్, పవర్ మొబైల్ యంత్రాల రంగంలో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్‌ వేర్ హౌసింగ్ కార్పోరేషన్‌తో భాగస్వామిగా పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు జోర్జన్ మాడ్స్ క్లాసన్‌ను కోరారు.

మోడ్రన్ ఎలక్ట్రాన్ కంపెనీ సీఈఓతో సీఎం భేటీ
‘మోడ్రన్ ఎలక్ట్రాన్’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు,సీఈఓ టోనీపాన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరును టోనీపాన్ ప్రశంసించారు. నీటి వినియోగం, ఈ-గవర్నెన్స్ లో ఐటీని ఏపీ సమర్ధంగా ఉపయోగించుకుంటోందన్నారు.   ఐటీ సహకారంతో విద్యుత్తును మరింత చవకగా అందించవచ్చని చెప్పారు.మోడ్రన్ ఎలక్ట్రాన్ కంపెనీ సీఈఓ వలె యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తాము ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.  ఏపీలో పారిశ్రామికాభివృద్ధిని అధ్యయనం చేయటానికి యువ పారిశ్రామికవేత్తలను,  అంకుర కంపెనీలు ప్రారంభించాలన్న ఉద్దేశం ఉన్నవారిని తమ రాష్ట్రానికి తీసుకురావాలని చంద్రబాబు కోరారు.  

ఎస్.ఎ.ఎస్.ఎ.సి తో సమావేశం
చైనా ప్రభుత్వ ఎస్సెట్స్ సూపర్‌విజన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెలవలప్‌మెంట్ బోర్డుతో వ్యాపార భాగస్వామిగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. టియాంజిన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికవేత్తలకు సుహృద్భావ సంబంధాలు ఏర్పడేందుకు ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు ఎంఓయూ చేసుకోవాలని సూచించారు.  పెట్టుబడి అవకాశాలపై అధ్యయనం చేయటానికి టియాంజిన్ పారిశ్రామికవేత్తల బృందం  ఆంధ్రప్రదేశ్ లో పర్యటించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు.  

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృందంలో ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డా. పరకాల ప్రభాకర్,  ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు సీఈఓ జె. కృష్ణకిశోర్, డెవలప్‌మెంట్ కమిషనర్, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ పి.వి.రమేష్, ముఖ్యకార్యదర్శులు జి. సాయిప్రసాద్, అజయ్ జైన్,  పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోకియ రాజ్, ప్రభుత్వ కార్యదర్శి (ఐటిఇ, కమ్యూనికేషన్ విభాగం) ప్రద్యుమ్న, క్యాపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజిమెంట్ కార్పోరేషన్ సీఎండి శ్రీమతి డి. లక్ష్మీ పార్థసారథి తదితరులున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement