ఈ ఏడాది నుంచి చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో భాగంగా విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్ అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలేజీలకు ఫీజు చెల్లింపు కొంత ఆలస్యమైనా, విద్యార్థులకు మాత్రం ఎప్పటికప్పుడు స్కాలర్‌షిప్‌లు చెల్లించనుంది. ముందుగా విద్యార్థులకు స్కాలర్‌షిప్(ఎంటీఎఫ్) చెల్లించాకే, కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్(ఆర్‌టీఎఫ్) చెల్లించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఏటా రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెరిగిపోతుండడం, విద్యార్థుల స్కాలర్‌షిప్ చెల్లింపులో జాప్యం జరుగుతుండటంతో వీటికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. 2014-15కు సంబంధించిన స్కాలర్‌షిప్ బకాయిలే పూర్తిగా చెల్లించకపోవడంతో 2016-17 నుంచైనా విద్యార్థులకు ఏ నెలకు ఆ నెల లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి స్కాలర్‌షిప్ చెల్లించాలని నిర్ణయించింది.
స్కాలర్‌షిప్‌లు అందక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో ఇకపై ఈ సమస్య ఎదురుకాకుండా చూడాలని భావిస్తోంది. అయితే బయోమెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు 75 శాతం ఉన్నవారికి, ఎప్పటికప్పుడు నిర్వహించే పరీక్షలకు హాజరై, తగిన మార్కులు సాధించినట్లుగా కాలేజీతో పాటు వర్శిటీ సర్టిఫికెట్ జారీచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని యోచిస్తోంది.2014-15, 2015-16 ఫీజు బకాయిలు రూ.3,500 కోట్ల దాకా ఉంటుంది. 2014-15కు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన ఎంటీఎఫ్ చాలా తక్కువగానే ఉండడంతో ఈ నెలాఖరులోగా దానిని పూర్తిగా చెల్లించాలనే ఆలోచనతో ఉంది. ఆయా శాఖల వారీగా ఖర్చుకాని నిధులు, ఇతర నిధులకు అనుగుణంగా చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. ఈ బకాయిలే కాక వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి కూడా దాదాపు రూ.2,400 కోట్ల మేర రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సి ఉంటుందని అంచనా.
స్టడీ సర్కిళ్లకు సొంత భవనాలు
విద్యార్థులు, నిరుద్యోగ యువతలో పోటీతత్వం పెంపొందించి, పరీక్షలకు మెరుగ్గా సిద్ధమయ్యేందుకు నాణ్యమైన శిక్షణను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్సీ శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఎస్సీ స్టడీ సర్కిళ్లకు అన్ని సౌకర్యాలతో సొంత భవనాలను నిర్మించనుంది. ఈ ఏడాదే వీటి నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేయాలని నిర్ణయించింది. అలాగే విద్యార్థులు, నిరుద్యోగ యువ త నైపుణ్యాల మెరుగుదల, ఇంజనీరింగ్, సాంకేతిక కోర్సులు, ఇతర సబ్జెక్టులకు సంబంధించిన విద్యార్థుల నైపుణ్యాల మెరుగుదలపై జిల్లాల్లోనే శిక్షణ తరగతులకు ప్రత్యేక చర్యలు తీసుకోనుంది. ఆయా ముఖ్యమైన అంశాలు, ప్రత్యేకత ఉన్న సబ్జెక్టుల్లో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో పది జిల్లాల నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ కోసం విద్యార్థులను ఒక చోట చేర్చి ఆయా కోర్సులు, ప్రత్యేక శిక్షణను అందించనున్నారు.
ఇక ప్రతి నెలా స్కాలర్‌షిప్
Published Wed, Mar 16 2016 3:23 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement