రూ 8.కోట్లు ‘ఊడ్చేశారు’!
పారిశుధ్యం పేరిట నిధుల దుబారా..
ఎక్కడి చెత్త అక్కడే.. అయినా పెరిగిన వ్యయం
రెండు నెలల్లో రూ. 8 కోట్లు అదనంగా ఖర్చు
సిటీబ్యూరో: గత ఆర్థిక సంవత్సరం పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ కోసం వివిధ పనులకు జీహెచ్‌ఎంసీ దాదాపు రూ. 420 కోట్లు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమాల నిర్వహణలో రవాణా విభాగంలో అవకతవకలు జరుగుతున్నాయని, నిధుల దుబారా జరుగుతోందని అధికారాలను వికేంద్రీకరించారు. అదనపు వాహనాలు అవసరమైనప్పుడు ప్రధాన కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని నిర్వహణ బాధ్యతలను వికేంద్రీకరించారు. తద్వారా ఖర్చు తగ్గడంతోపాటు ఎప్పటికప్పుడు పనులు జరుగుతాయని, పారిశుధ్యం బాగుపడుతుందని భావించారు. నిర్వహణను జోనల్/సర్కిల్ స్థాయికి వికేంద్రీకరించారు. అయినా.. పారిశుధ్యం మెరుగు పడలేదు. ఎక్కడ చూసినా ఎప్పటిలాగే చెత్తకుప్పలు. కొన్ని ప్రాంతాల్లోనైతే మరింతగా పేరుకుపోతున్న చెత్తగుట్టలు. నిధుల దుబారా తగ్గి ఖర్చు తగ్గిందా అంటే అదీలేదు. పెపైచ్చు పెరిగింది. గడచిన మే, ఏప్రిల్ రెండు నెలల్లోనే కేవలం అదనపు వాహనాల అద్దెకోసమే దాదాపు రూ. 8 కోట్లు అదనంగా ఖర్చు చేశారని విశ్వసనీయ సమాచారం.
నగరంలో చెత్త కుప్పలు ఉండరాదని, చెత్తను ఎప్పటికప్పుడు తరలించేందుకని చెప్పి ఏకంగా 193 అదనపు వాహనాలను అద్దెకు తీసుకున్నారు. వీటిల్లో 25 టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 44, పది టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 22 , ఆరు టన్నుల సామర్ధ్యం కలిగిన వాహనాలు 76, జేసీబీలు 51 ఉన్నాయి. వీటికోసం చెల్లించే అద్దెలను లెక్కిస్తే నెలకు దాదాపు రూ. 4 కోట్ల వంతున రెండు నెలలకు వెరసి రూ. 8 కోట్లు ఖర్చు పెరిగిందని తెలుస్తోంది. పారిశుధ్యం మెరుగుపడిందా అంటే మాత్రం లేదు. నగరంలోని అనేక ప్రాంతాల్లో పేరుకుపోతున్న చెత్తను యార్డుకు తరలించేందుకే ఈ అదనపు వాహనాలను తీసుకున్నప్పటికీ, పరిస్థితి మాత్రం మారలేదు.
మేయర్ ఆదేశాలు బేఖాతర్..
చెత్త బయట పడకుండా ఉండేందుకు, దుర్వాసన రాకుండా ఉండేందుకు చెత్త తరలించే వాహనాలకు కవర్ ఉండాలని మేయర్ బొంతురామ్మోహన్ ఆదేశించారు. అయినప్పటికీ దానిని అమలు చేయడం లేరు. ఎలాంటి కవర్ లేకుండానే రోడ్లపై జనసమ్మర్ధం ఉన్న సమయంలోనే చెత్తను తరలిస్తుండటంతో గాలికి అది రోడ్లపై, ప్రయాణికులపై పడుతోంది. దాంతో కొన్ని సందర్భాల్లో చెత్త కళ్లల్లోపడి ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.