అంకెల స్వర్గం..‘మహా’ దూరం
అమలుకు నోచని గ్రేటర్ బడ్జెట్
ఈ ఏడాది కేటాయింపు రూ.5,550 కోట్లు
రూ.2000 కోట్ల పనులు కూడా కాని వైనం
రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినది రూ.629 కోట్లు
ఇప్పటి వరకు వచ్చింది రూ.24 కోట్లు
ఇదీ జీహెచ్‌ఎంసీ తీరు
సిటీబ్యూరో: ఆ అంకెలు ... అభివృద్ధిని మన కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తాయి. మనల్ని ‘కొత్త’లోకంలోకి తీసుకుపోతాయి. కళ్లు తెరచి చూస్తే మన పరిస్థితి ‘ఎక్కడి గొంగళి అక్కడే’ అన్నట్టుగా ఉంటుంది. ఇదీ జీహెచ్‌ఎంసీ బడ్జెట్ మాయ. ఏటా ఈ లెక్కలు ‘భారీ’గా పెరుగుతున్నా... పనులు ఆ స్థాయిలో కనిపించడం లేదు. ‘మబ్బుల్లో నీళ్లు చూసి...ముంత ఒలకబోసుకున్నట్టు’గా... భారీ ఎత్తున నిధులు అందుతాయనే అంచనాలతో అంతే స్థాయిలో బడ్జెట్‌కు ఆమోదం తెలపడం.. అవి రాకపోవడం ఒక కారణమైతే... పనులు చేసేందుకు తగిన యంత్రాంగం లేకపోవడం మరో కారణం. ఈ ఆర్థిక సంవత్సరం కూడా ఇదే పరిస్థితి పునరావృతమవుతోంది. రూ.5,550 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించినప్పటికీ... ఇప్పటి వరకు రూ.2000 కోట్ల పనులైనా చేయలేకపోయారు. దీన్ని పక్కన పెట్టేసి... వచ్చే ఏడాదికి ప్రస్తుత బడ్జెట్ కంటే మరో రూ.100 కోట్లు పెంచి ప్రభుత్వ ఆమోదానికి నివేదించినట్లు తెలుస్తోంది.
కాగితాల్లోనే ..
మున్నెన్నడూ లేని విధంగా ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) రూ.5,550 కోట్లతో బడ్జెట్‌ను ఆమోదించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్లు... పద్దుల కింద రావాల్సిన నిధులు దాదాపు రూ.629 కోట్లు. ఇప్పటి వరకు అందింది దాదాపు రూ.24 కోట్లు మాత్రమే. దీన్ని బట్టి అంచనాకు... వాస్తవానికి మధ్య దూరాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం మూడు నెలలు మాత్రమే గడువుంది. ఒకవేళ మరిన్ని నిధులు అందినా... ఈ కాస్త సమయంలో ఏం చేయగలరనేది వేల కోట్ల ప్రశ్న. జీహెచ్‌ఎంసీ స్వయంగా సమకూర్చుకునే నిధుల నుంచి చేపట్టాల్సిన పనుల్లోనూ చాలా వరకు ప్రారంభించ లేదు. తగినంత యంత్రాంగం లేకపోవడం ఓ కారణమైతే... భారీ ఎత్తున చేపట్టాలనుకున్న ఇంజినీరింగ్ పనుల టెండర్లు పూర్తి కాకపోవడం వంటివి మరో కారణం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులు.. ఇప్పటి వరకు అందినవి ఇలా ఉన్నాయి. త్వరలో జీహెచ్‌ఎంసీ పాలక మండలి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు దాదాపు మరో రెండు నెలల పాటు కొత్త పనులు చేపట్టే అవకాశం లేదు.
వచ్చే ఏడు మరింత పెద్ద బడ్జెట్..
వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా... వచ్చే (2016-17) ఆర్థిక సంవత్సరానికి సైతం భారీ బడ్జెట్‌నే రూపొందించినట్లు తెలిసింది. దాదాపు రూ. 5,700 కోట్లతో రాబోయే బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిసింది.
ఈ ఏడాది రాకున్నా...
ఈ ఆర్థిక సంవత్సరం నిధులే పూర్తిగా రాలేదు. అయినప్పటికీ రివైజ్డ్ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను మరింత ఎక్కువగా పొందుపరిచారు. ఈ ఏడాది ప్రారంభంలో ప్రభుత్వం నుంచి వచ్చేది రూ.629 కోట్లుగా పేర్కొనగా... రివైజ్ చేసి దాన్ని రూ.1,420 కోట్లకు పెంచారు. అంటే మరో రూ.800 కోట్లు అదనంగా చేర్చారు. ఇందులో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు రూ.400 కోట్లు చేర్చారు.