జీహెచ్‌ఎంసీ ఆల్‌టైమ్ రికార్డ్
⇒పెరిగిన ఆస్తిపన్ను వసూళ్లు
⇒గత ఆర్థిక సంవత్సరం రూ.1025 కోట్లు
⇒ఈ మార్చి 30 నాటికి రూ.1137 కోట్లు
⇒నేడు అర్ధరాత్రి వరకు సీఎస్సీల సేవలు
సిటీబ్యూరో: పెద్దనోట్ల రద్దు సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టినప్పటికీ జీహెచ్‌ఎంసీకి మాత్రం కాసుల వర్షం కురిపించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే ఆస్తిపన్నుగా రూ.180 కోట్లు జీహెచ్‌ఎంసీ ఖజానాకు చేరింది. గతంలో ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చినెల చివరి వారం.. చివరి రెండు రోజుల్లోనే ఎక్కువ పన్ను వసూలయ్యేది. మార్చి 31న ఒక్కరోజే రూ.వందకోట్లకు పైగా వసూలైన ఘటనలున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరులో పన్ను బకాయిలపై వడ్డీ రద్దు చేయడం వంటి కారణాలతో ప్రజలు చివరి వరకు వేచి చూసేవారు. ఈసారి వడ్డీ మాఫీ ఉండదని ముందే జీహెచ్‌ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. పెద్దనోట్లరద్దు, వడ్డీ మాఫీ ఉండదని తెలియజేయడంతో ఆస్తిపన్ను చెల్లించేవారిలో మెజారిటీ ప్రజలు ఇప్పటికే చెల్లింపులు చేశారు. ఇంకా చెల్లించని వారుంటే గతంలో మాదిరిగా చివరిరోజు చెల్లిస్తారని భావిస్తున్నారు. ఇలా మరో రూ.50 కోట్లకు పైగా వచ్చే అవకాశమున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎక్కువ ఆస్తిపన్ను వసూళ్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్ను ఆదాయం రూ.1200 కోట్లకు చేరే అవకాశముందని లెక్కలు వేస్తున్నారు.
అర్ధరాత్రి వరకు సీఎస్సీలు సేవలు
ఆస్తిపన్ను చెల్లింపునకు శుక్రవారం చివరిరోజు కావడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయాల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తాయని, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు.
ఆన్‌లైన్‌లో చెల్లించండి..
ఆస్తిపన్ను చెల్లింపునకు చివరి రోజైన శుక్రవారం సీఎస్సీలు, మీసేవా కేంద్రాల్లో అధిక రద్దీ ఉండే దృష్ట్యా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి సూచించారు. ఇందుకు జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్ www.ghmc.gov.inÌZలోని పేమెంట్స్ ట్యాబ్‌పై క్లిక్‌చేసి, అందులోని సూచనలకు అనుగుణంగా పన్ను చెల్లించవచ్చని విజ్ఞప్తి చేశారు.