నగదు కొరతతో అప్పుల ఊబిలోకి రైతులు
అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని, తమ సొంత ఖాతాల్లోని డబ్బును కూడా తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. కూలీలకు ఉపాధి హామీ జీతాలివ్వడం లేదని విమర్శించారు. రుణమాఫీ 4 విడతల్లో చేయడం వల్ల రైతుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, వడ్డీమాఫీ పథకంగా మారిపోయి బ్యాంకులకు ఉపయోగపడిందని విమర్శించారు. రైతుల పంటరుణాలపై వడ్డీభారం ప్రభుత్వమే భరిస్తుందని ఆరు నెలల క్రితం సీఎం కేసీఆర్ అసెంబ్లీలోనే హామీ ఇచ్చారని ఉత్తమ్ గుర్తుచేశారు. అయినా అమలు కాలేదన్నారు.
నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్న కాంగ్రెస్ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్ కార్పొరేటర్ హత్య కేసులో స్థానిక కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిని అక్రమంగా ఇరికిస్తున్నారని, దీనిపై డీజీపీతో మాట్లాడినట్లు చెప్పారు. కేసు నుంచి రాజేందర్‌రెడ్డి పేరును తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. పొంగులేటి మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసులో సంబంధమున్న వారందరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.