కాంగ్రెస్‌లో ..డిగ్గీ బూస్ట్ | Filling the excitement of the Action Plan of the Congress activists | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ..డిగ్గీ బూస్ట్

Published Wed, Jan 13 2016 12:59 AM | Last Updated on Tue, Aug 14 2018 3:55 PM

కాంగ్రెస్‌లో ..డిగ్గీ బూస్ట్ - Sakshi

కాంగ్రెస్‌లో ..డిగ్గీ బూస్ట్

కార్యకర్తల్లో ఉత్సాహం నింపే దిశగా కాంగ్రెస్ యాక్షన్‌ప్లాన్
 14న తొలి, 16న తుది జాబితాల విడుదలకు సన్నాహాలు

 
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని అగ్రనేతలతో తారస్థాయికి తీసుకువెళ్లే దిశగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ప్రారంభమైంది. మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్(డిగ్గీ రాజా) తో ప్రారంభమైన ప్రచార పర్వంలో గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీలతో పాటు ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, ఎంపీ చిరంజీవి తదితరులతో హీటెక్కించే దిశగా వ్యూహం రూపొందించింది. మంగళవారం దిగ్విజయ్‌సింగ్, టీ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డిల ఆధ్వర్యంలోని అగ్రనేతలు రాజేంద్రనగర్, ఖైరతాబాద్, సనత్‌నగర్, ఎల్‌బీ నగర్ నియోకవర్గాల్లో నిర్వహించిన సభల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు..హైదరాబాద్‌లో అభివృద్ధి తమ హాయాంలోనే చేశామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాజేంద్రనగర్ సభ మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరగ్గా, మిగిలిన మూడు సభలు ఆయా నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓటమి పాలైన దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇటీవల హైదరాబాద్- రంగారెడ్డి జిల్లా నేతల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదం నేపథ్యంలో దానం నాగేందర్ తొలి రోజు ఖైరతాబాద్ సమావేశానికే పరిమితమయ్యారు. ఎల్‌బీనగర్‌లో నిర్వహించిన సభలో భారీ ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలిరావటం ఉత్సాహం నింపింది.

శివారు నియోజకవర్గాలకు సినీ అట్రాక్షన్ :  కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకులతో పాటు నగర శివారు నియోజకవర్గాల్లో సినీనటుడు చిరంజీవితో ప్రచారం చేయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే హైదరాబాద్ మేయర్ పోస్ట్‌కు మాజీ క్రికెటర్ అజ హారుద్దీన్‌ను నిలిపేందుకు పీసీసీ నాయకులు చేసిన ప్రయత్నాలు విఫలం కావటంతో, కనీసం అజహారుద్దీన్‌ను పాతబస్తీలో ప్రచారమైనా చేసిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ నగరంలో అన్ని డివిజన్లకు పోటీ చేయటం ఖరారు కావటంతో ఏకాభిప్రాయం కుదిరిన చోట్ల అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను 14వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థి ఎంపిక క్లిష్టమైన డివిజన్ల అంశాన్ని పీసీసీ,సీఎల్పీ నేతల జోక్యంతో ఈనెల 16న విడుదల చేయనున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement