- మోదీ పర్యటనకు సిద్ధమైన షెడ్యూలు
- నాలుగు జిల్లాల్లో కార్యక్రమాలు
- గజ్వేల్‌లో బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆగస్టు 7న ప్రధాని రాష్ట్రానికి రానున్నారని, అయితే పీఎంఓ నుంచి నిర్ణీత షెడ్యూలు రాలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే సిద్ధమైన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం ప్రధాని పర్యటన వివరాలిలా ఉన్నాయి. ఆగస్టు 7న మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 1.45కు రామగుండం చేరుకుంటారు. ఎన్‌టీపీసీ నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
రామగుండంలోని ఎఫ్‌సీఐని పునర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.15 గంట లకు ఆదిలాబాద్ జిల్లా జైపూర్‌కు చేరుకుంటారు. సింగరేణి కాలరీస్‌కు చెందిన 1,200 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేస్తారు. అక్కడి నుంచి 2.45 గంటలకు బయల్దేరి 3.10 గంటలకు వరంగల్ చేరుకుంటారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్, కాళోజీ హెల్త్ వర్సిటీకి భూమి పూజ చేస్తారు. చెరువుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం పైలాన్‌ను మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం 4.10 గంటలకు గజ్వేల్‌కు చేరుకుంటారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథను ప్రారంభిస్తారు. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ పనులకు పునాది రాయి వేస్తారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.
మోదీ రాష్ట్ర పర్యటన ఖరారు!
Published Tue, Jul 26 2016 5:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:30 PM
Advertisement