సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రైతులకు ఈ ఏడాది ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ. 4 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయం పథకం అమలుపై వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఐదు ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. సోమవారం సచివాలయంలో తొలిసారి జరిగిన ఈ సమావేశంలో రైతులకు చెక్కులివ్వడం, నేరుగా డబ్బులివ్వడం, టీ వ్యాలెట్ ద్వారా అందజేయడం, ఆర్‌టీజీఎస్ ద్వారా ఖాతాల్లో వేయడం, పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేయడం అనే ప్రతిపాదనలను పరిశీలించింది. అయితే వీటిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున నేరుగా రైతుల అభిప్రాయాలనే తీసుకోవాలని నిర్ణయించింది.
ఇందుకోసం మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లాకు ఒక గ్రామంలో రైతు సభలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించనుంది. హైదరాబాద్ మినహా మిగిలిన 30 జిల్లాల్లోని 30 గ్రామాల్లో ఈ ప్రతిపాదనలపై రైతుల అభిప్రాయం సేకరించి ఏ అభిప్రాయానికి ఎంత శాతం రైతుల మద్దతు ఉందో పరిగణనలోకి తీసుకోనుంది. ఆ ప్రకారం వ్యవసాయశాఖ నివేదిక తయారు చేయనుంది. అలాగే ప్రజాప్రతినిధులు, రైతు నేతలతో మంత్రులు మేధోమథనం చేయనున్నారు. ఉపసంఘంలోని మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులతోనూ చర్చించనున్నారు. ఐదు ప్రతిపాదనల్లో ఏ ప్రతిపాదనకు రైతులు, ప్రజాప్రతినిధులు మొగ్గుచూపారో దాని ప్రకారం నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది.
ఇందుకోసం ఉపసంఘం బుధవారం మరోసారి సమావేశం కానుంది. ఆ రోజు కూడా స్పష్టత రాకుంటే మూడోసారి కూడా ఉపసంఘం సమావేశమయ్యే అవకాశముంది. సోమవారం జరిగిన సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, టి. హరీశ్‌రావు, కె. తారక రామారావు, ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్‌శర్మ, వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణ, వ్యవసాయశాఖ కమిషనర్ ఎం. జగన్మోహన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రతినిధులు పాల్గొన్నారు.
నేరుగా డబ్బు వద్దంటున్న వ్యవసాయశాఖ...
71.75 లక్షల వ్యవసాయ ఖాతాల్లోని రైతులకు చెందిన 1.42 కోట్ల ఎకరాల భూమికి ప్రభుత్వం ఈ పథకం కింద ఒక సీజన్‌కు దాదాపు రూ. 5,680 కోట్లు అందించాల్సి రానుంది. అయితే అంత సొమ్ము నేరుగా ఇవ్వడం అసాధ్యమని ఆర్థిక, వ్యవసాయశాఖ వర్గాలు ఉపసంఘం భేటీలో స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒకేసారి అంత సొమ్మును జమ చేయడం కష్టమని ఆర్థికశాఖ స్పష్టం చేయగా, గ్రామాల్లో అంత డబ్బు పంపిణీ చేస్తే అక్రమాలు జరిగే అవకాశముందని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నట్లు సమాచారం. నేరుగా డబ్బు పంపిణీ చేసే ప్రక్రియను కోర్టులో సవాల్ చేసే అవకాశాలున్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇక రైతు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయడం వల్ల వారి అప్పులను బ్యాంకులు తీర్చేసుకుంటాయన్న అనుమానాలున్నాయి. అలా చేయబోమని బ్యాంకర్లు గ్యారంటీ ఇస్తే ఆలోచించాలన్న చర్చ జరిగింది. ఈ అంశంపై ఎస్‌ఎల్‌బీసీ మంగళవారం బ్యాంకర్లతో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయం కూడా కీలకం కానుంది. వ్యవసాయ రుణమాఫీ విషయంలో రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకూడదని రెండేళ్లుగా ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో మంత్రులు కోరినా బ్యాంకులు పట్టించుకోకపోవడం విదితమే. కాబట్టి బ్యాంకుల హామీని నమ్మి ముందుకెళ్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయకుండా సంబంధిత అన్ని బ్యాంకుల్లో చెల్లుబాటయ్యేలా చెక్కులు ఇవ్వడమే మేలని వ్యవసాయశాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఆయా చెక్కులను గ్రామ సభల్లో రైతులకు పంపిణీ చేస్తే ఏ సమస్యా రాదని అంటున్నారు. మే 15వ తేదీ నాటికి రైతులకు డబ్బులు చెల్లించాల్సి ఉండగా ఆ సమయంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో రైతు చైతన్య సభలు జరగనున్నాయి. దీంతో అప్పుడే గ్రామ సభలు నిర్వహించి పెట్టుబడి పథకం చెక్కులను రైతులకు ఇస్తే బాగుంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితం మంత్రి పోచారం నల్లగొండ జిల్లాలోని పెద్దకాపర్తి గ్రామంలో రైతు సభ నిర్వహించగా అందులో ఎక్కువ మంది రైతులు పోస్టల్ ఖాతాల ద్వారా పెట్టుబడి సాయం నగదును పంపిణీ చేయాలని కోరారు. రైతులు బ్యాంకులను నమ్మట్లేదనేందుకు ఇదో నిదర్శనమని అధికారులు చెబుతున్నారు.
దేశం చూపు తెలంగాణ వైపు: మంత్రి పోచారం
పెట్టుబడి పథకంపై దేశమంతా తెలంగాణ వైపు ఆసక్తిగా చూస్తోందని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం సచివాలయంలో ఉపసంఘం భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘‘మొదటి సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకున్నాం. గ్రామాల్లో సభలు, సమావేశాల ద్వారా రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంటాం. బుధవారం మరోసారి సమావేశమవుతాం.
పెట్టుబడి పథకం నగదు నేరుగా రైతులకు చేరాలన్నదే మా అభిమతం. రైతులకు ప్రస్తుతమున్న ఖాతాల్లోనే నగదును జమ చేస్తే పాత బకాయిల కింద జమకడతారని రైతులు అనుమానం వ్యక్తం చేయడం సహజం. దీనికి సంబంధించి ఎస్‌ఎల్‌బీసీ అత్యవసర సమావేశం మంగళవారం జరగనుంది’’ అని మంత్రి చెప్పారు. ఆ సమావేశంలో వారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూస్తున్నామని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పోచారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment