ప్రత్యూష (ఫైల్)
అభ్యంతరం లేదంటూ హైకోర్టుకు తెలిపిన తండ్రి
సాక్షి, హైదరాబాద్: సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూష కేసు మరింత పురోగతి సాధించింది. తన పేరు మీదున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆమె తండ్రి రమేష్ సోమవారం హైకోర్టుకు నివేదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం... రిజిస్ట్రేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.
ప్రత్యూషను ఆమె సవతి తల్లి చాముండేశ్వరి అలియాస్ శ్యామల తీవ్రంగా హింసించినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) శరత్‌కుమార్ తన వాదనలు వినిపించారు. తన పేరు మీదనున్న ఫ్లాట్‌ను ప్రత్యూష పేరున రిజిస్టర్ చేసేందుకు అంగీకరించినట్టు శరత్‌కుమార్ విన్నవించారు.
దీనిపై స్పందించిన ధర్మాసనం... వెంటనే అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఫ్లాట్‌పై వచ్చే అద్దె ప్రత్యూషకు అందేలా చూడాలని సూచించింది. సంక్రాంతి సెలవుల లోపు ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని శరత్‌కుమార్ ధర్మాసనానికి తెలిపారు.