ఓయూకు ‘విదేశీ’ కళ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా వర్సిటీ విదేశీ విద్యార్థులతో కళకళలాడుతోంది. అత్యున్నత బోధన... ఆహ్లాదకర వాతావరణం... విద్యార్థుల ఫ్రెండ్లీ నేచర్... భిన్న సంస్కృతుల కలయిక... వెరసి విదేశీ విద్యార్థుల స్వప్నాలు సాకారం చేసే కేంద్రంగా ఓయూ భాసిల్లుతోంది. అందుకే ఇక్కడ చదవడానికి ఇతర దేశాల వారు విపరీతంగా పోటీపడుతున్నారు. ప్రతియేటా వీరి సంఖ్య విశేషంగా పెరుగుతూ వస్తోంది కూడా. ప్రస్తుతం ఇక్కడ చదువుతున్న ఫారిన్ స్టూడెంట్స్ సంఖ్య ఐదువేలకు పైగానే. దేశంలోనే పుణే వర్సిటీ తర్వాత ఎక్కువమంది విదేశీయులకు ఉన్నతవిద్య అందిస్తున్న ఏకైక విద్యాసంస్థ ఓయూనే కావడం విశేషం.
గత మూడేళ్లుగా ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న తెలంగాణ ఉద్యమం సైతం విదేశీ విద్యార్థుపై ఎలాంటి ప్రభావం చూపలేదు. వరుస ఆందోళనలతో విద్యార్థుల సంఖ్య తగ్గకపోగా, గతంతో పోలిస్తే 2013-14 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల సంఖ్య మరింత పెరగడం విశేషం. ఈ ఏడాది 70 దేశాల నుంచి కొత్తగా 1530 మంది విదేశీ విద్యార్థులు వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు పొందడం గమనార్హం. వర్సిటీలో 13 ఫ్యాకల్టీలు, 54 విభాగాలు ఉండగా, ఇప్పటివరకు 50 విభాగాల్లో విదేశీ విద్యార్థులు ఉన్నారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కేవ లం పాతికమందితో ప్రారంభమైన ఉస్మానియా విదేశీ సంబంధాల విభాగం ప్రస్తుతం ఐదువేల మార్కు దాటింది. వీరిలో 85శాతం సెల్ప్‌ఫైనాన్స్ స్టూడెంట్స్ కాగా, మరో 15 శాతం మంది ఆయా దేశాల ఉపకార వేతనాలతో చదువుకుంటున్నారు. వీరి రాకతో క్యాంపస్ సహా అనుబంధ కాలేజీలైన నిజాం, సైఫాబాద్, సికింద్రాబాద్, సెయింట్ మేరీస్, సెయింట్ ఫ్రాన్సెన్, భవన్స్ తదితర కాలేజీలు కళకళలాడుతున్నాయి.
సగం మంది అమ్మాయిలే
ఓయూకు 2012-13 విద్యాసంవత్సరంలో 69 దేశాలకు చెందిన 1341 మంది విద్యార్థులు రాగా, ఈ ఏడాది కొత్తగా బెల్జియం నుంచి కూడా వచ్చారు. దీంతో వీరి సంఖ్య 1530 మందికి పెరిగింది. వీరిలో దాదాపు 800 మంది అమ్మాయిలే. వీరిలో ఎక్కువమంది సూడాన్, ఇరాక్ దేశాల వారే. ఈ ఏడాది చేరినవారిలో అత్యధికంగా పీజీ కోర్సుల్లో 575 మంది, బీఏలో 112, బీకాంలో 186, బీఎస్సీలో 123, ఎమ్మెస్సీలో 232, ఎంఏలో 164, బీసీఏలో 162, బీబీఏలో 124, ఎంబీఏలో 84, ఇంజనీరింగ్‌లో 70 మంది అడ్మిషన్లు పొందారు. కాగా విదేశీయులు తమ కాలేజీలో చదివితే, కళాశాల ఖ్యాతి పెరుగుతుందనే భావంతో వారిని ఆకర్షించేందుకు నగరంలోని పలు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి.
పలు వర్సిటీల గుర్తింపు రద్దు కావడం వల్లే..
దేశంలోని పలు వర్సిటీలకు యూజీసీ గుర్తింపు రద్దు చేయడంతో పలువురు ఓయూలో చేరుతున్నారు. ఓయూ పరిధిలో ప్రస్తుతం 5వేలకు పైగా విదేశీ విద్యార్థులున్నారు. వీరి ద్వారా ఏటా రూ.16 కోట్లు వస్తు న్నాయి.
- ప్రొ.వేణుగోపాలరావు, డెరైక్టర్, ఓయూ విదేశీ విభాగం
స్నేహభావం ఆకట్టుకుంది
ఇక్కడి విద్యార్థుల స్నేహభావం ఆకట్టుకుంది. ఓయూలో విద్యాభ్యాసం బాగుంటుందని పలువురు చెప్పడంతో మూడేళ్ల క్రితం ఇరాన్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నిజాం కళాశాలలో బీఏలో ప్రవేశం పొందాను.
- హామిదా, బీఏ విద్యార్థిని, నిజాం కళాశాల
ఓయూ డిగ్రీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
ఓయూ డిగ్రీలకు మంచి గుర్తింపు ఉంది. క్యాంపస్‌లో ఇంజనీరింగ్ చదువుతున్నా. ఇక్కడి ప్రజల జీవన విధానానికి ఇరాక్‌తో సారుప్యత ఉంది. స్వేచ్ఛ, రుచికరమైన ఆహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, భాష నన్ను ఆకర్షించాయి.
- అమర్, బీటెక్ విద్యార్థి, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్
సొంతదేశంలో ఉన్న ఫీలింగ్
హైదరాబాద్ భిన్న సంస్కృతుల నిలయం. భార్యాపిల్లతో ఇక్కడే ఉంటూ ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నాను. ఇక్కడ ఉంటే మా దేశంలోనే ఉన్నట్లు ఉంది. ఇక్కడి డిగ్రీలకు మా దేశంలోని (సౌదీ) ఆయిల్ కంపెనీల్లో ఉద్యోగాలు బాగా లభిస్తాయి.
- సినాన్, ఎంటెక్ విద్యార్థి, ఓయూ ఇంజనీరింగ్ కాలేజ్