ఓయూలో జరిగిన సదస్సులో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్
సంఘటితంగా పోరాడే వేదికలు కావాలి
ఓయూ సదస్సులో ప్రొ.కోదండరామ్ పిలుపు
హైదరాబాద్: అనేక ఇక్కట్లకు గురవుతున్న రైతులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలూ సంఘటితమై తెలగాణ ఉద్యమం తరహాలోనే శాంతియుతంగా మరో ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వారి సమస్య అంతిమంగా రాజకీయ సమస్యనేనని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఓయూ క్యాంపస్‌లో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రం విభాగం, పరిశోధన విద్యార్థుల ఆధ్వర్యంలో ‘వ్యవసాయ సంక్షోభం- రైతుల ఆత్మహత్యలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లా డారు. చంద్రబాబు హయాం నుంచి అమలవు తున్న సరళీకృత ఆర్థిక విధానాలతో రైతులకు కష్టాలు ఆరంభమై నేటికీ వారి ప్రాణాలను హరి స్తున్నాయన్నారు. బోర్లను వేసి నీరుపడక, ఎరువుల ధరలు పెరుగుదల, గిట్టుబాటు ధరలు లేకపోవడం, రైతులపై పెత్తనం చేసే శక్తులు అధికమవడం, మార్కెట్‌లో దోపిడీ తదితర కారణాలతో రైతు చితికిపోయి ఆత్మబలిదానాలు చేసుకుంటున్నారని కోదండరామ్ అన్నారు. కష్టనష్టాలకు తాళలేక 1983 నుంచి ఇప్పటి వరకు 26 వేల మంది రైతులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇక ఈ ఏడాదిలో ఇప్పటికి 430 మంది రైతులు బలవన్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాగరిక సమాజంలో మనిషి చనిపోతున్నా స్పందించక పోవడం విచారకరమన్నారు. పరిశోధన విద్యార్థులు రైతు సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేసి గ్రామాలలో పర్యటించి రైతుల్లో మనో ధైర్యాన్ని కల్పించాలని సూచించారు. రైతుకుటుంబాల నుంచి వచ్చిన మనమందరం ఇందులో భాగస్వాములు కావాలన్నారు. అంతి మంగా రైతులది రాజకీయ సమస్య అయినందున విద్యార్థులతోపాటు అన్నివర్గాలు ఈ సమస్యపై స్పందించాలని సూచించారు. సామాజిక వేత్త ప్రొ.సి.గణేష్ అధ్యక్షత వహించిన సదస్సు లో రైతు సంఘం నేత మల్లారెడ్డి, వివిధ విభాగాల అధ్యాపకులతోపాటు పరిశోధన రంగ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.