కేసీఆర్‌తో స్పర్థలు లేవు
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
కూసుమంచి: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, తనకు ఎటువంటి మనస్పర్థలు లేవని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్ఘాటించారు. తెలంగాణ వికాసం కోసం పలు సంఘాలతో కలసి జేఏసీ కృషిచేస్తుందని అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వచ్చాక మీకు అంతగా గుర్తింపులేద ని ప్రచారం ఉందని విలేకరులు కోదండరాంను ప్రశ్నించగా, ఆయన తన సమాధానాన్ని దాటవేస్తూ తెలంగాణ వికాసం కోసం కృషిచేస్తామని అన్నారు.
కాకపోతే తెలంగాణ ఉద్యమంలో ఎందరో భౌతికంగా, శారీరకంగా నష్టపోయారని, వారిని తెలంగాణ సమాజంతో పాటు ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. కొందరు ఉద్యమంలో లేకుండానే నేటి ప్రభుత్వంలో గుర్తింపు పొందుతున్నారని విలేకరులు అనడంతో రాజకీయాల్లో ఉన్నందునే వారికి రాజకీయంగా గుర్తింపు వస్తుందని అన్నారు. ఉద్యమంలో ఉన్నవారిని ఎవరూ మరువరని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడిందని, ఈ ప్రభుత్వంలో ప్రజలకు వారధిగా తాము ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలపై జేఏసీ తరుఫున త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించన్నుట్లు తెలిపారు.