కోదండరాంపై విమర్శలా?
ఓయూలో సీఎం, మంత్రుల దిష్టి బొమ్మలు దహనం
హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ కోదండరాంను మంత్రులు విమర్శించడంపై ఉస్మానియా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వేర్వేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. నిరుద్యోగ, విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టి సీఎంతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు దిష్టిబొమ్మలను ద హనం చేశారు.
అనంతరం నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కల్యాణ్, బీసీ ఉద్యమ వేదిక అధ్యక్షుడు దేశగాని సాంబశివగౌడ్, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ బాబులాల్ నాయక్ మాట్లాడుతూ కోదండరాంను విమర్శిస్తే సహించేది లేదన్నారు. కోదండరాం తెలంగాణ గాంధీ అని, ఆయన్ను విమర్శించే వారు అవివేకులని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) మండిపడింది. కోదండరాంను విమర్శించిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తెలంగాణలో తిరగన్విబోమని నవ తెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్ వినోద్‌కుమార్ హెచ్చరించారు.
కోదండరాంకు రక్షణ కల్పించండి
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌కు ఓయూ విద్యార్థి జేఏసీ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాంకు రక్షణ కల్పించాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి కోదండరాంకు ప్రాణహాని ఉందని లేఖలో పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులు కోదండరాంపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని వివరించారు. ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్న కోదండరాంను రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతోందన్నారు.