భారత్..బెస్ట్
తమ దేశం కన్నా భారత్ మిన్న అంటున్న విదేశీ మహిళలు
మహిళా దినోత్సవం సందర్భంగా విదేశీ విద్యార్థులతో ‘సాక్షి’ టాక్ షో
సికింద్రాబాద్/తార్నాక: ఆకాశంలో సగం... అవకాశాల్లో సగం... అన్నింటా మహిళలు సగం...సగం...అనే నానుడుని నేటి మహిళలు నిజం చేస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మహిళలు పురుషులతో సమానంగా పోటీపడుతూ అన్నిరంగాల్లో దూసుకువెళుతున్నారు. అయితే మహిళలకు కొన్ని దేశాల్లో ఉన్నతమైన స్థానం లభిస్తుండగా, మరి కొన్ని దేశాలు వారిపై ఎన్నో ఆంక్షలు విధిస్తూ కట్టడి చేస్తున్నాయి. భారత్‌లో స్త్రీలకు కావాల్సినంత స్వేచ్చ, అపూర్వమైన గౌరవం లభిస్తుందని, అది భారతీయుల గొప్పతనమని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో ఇండియా తమ దేశాలకంటే ముందుందని పలువురు విదేశీ విద్యార్థినులు పేర్కొన్నారు. భారతదేశంలో మహిళలు శాస్త్ర సాంకేతిక రంగాలు, విద్య ,ఉద్యోగావకాశాల్లో సమానత్వం సాధించలేకపోయినా ఒక మహిళగా వారికి లభించే గౌరవం ఎంతో గొప్పదని, భారత దేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు గొప్పవని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పలువురు విదేశీ విద్యార్థులతో ‘సాక్షి’ నిర్వహించిన టాక్ షోలో విదేశీ విద్యార్థుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...
భారత సంస్కృతి చాలా బాగుంది...
మా దేశంలో మహిళలను చాలా గౌరవిస్తారు. మా దేశంతో పోలిస్తే ఇక్కడ మహిళలకు ఇచ్చే గౌవరం ఎక్కువనే చెప్పాలి. మా దేశంతో పోలిస్తే ఇక్కడ ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ ఒక ప్రత్యేకగా చెప్పవచ్చు. ఇక్కడ స్త్రీలు ధరించే దుస్తులు వారి ప్రాంతాలు, సంస్కృతులకు అద్దంపడుతున్నాయి. – న్వీకూ వుచే, నైజీరియా
మా దేశంలో ప్రభుత్వమే నిధులు ఇస్తుంది
మా దేశంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని ప్రభుత్వమే నిర్వహించడమేగాక, మహిళలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేస్తుంది. మహిళా దినోత్సవాన్ని చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా కలిసి జరుపుకుంటాం. ఆ రోజు అనేక కార్యక్రమాలు నిర్వహించి మహిళలను ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తుంది. – మర్హబో ముర్తాస్వావ్,తుర్కుమెనిస్తాన్
పండుగలా జరుపుకుంటాం
మా దేశంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు సైతం సెలవు ప్రకటిస్తాయి. కుటుంబ సభ్యులంతా కలిసి çమహిళా దినోత్సవాన్ని ఒక పండుగలా జరుపుకునే సంస్కృతి మా దేశంలో కొనసాగుతోంది. భారత దేశంలో ఉన్నట్లుగానే మా దేశంలో కూడా మహిళలకు స్వేచ్చ ఉంది. –రోయా కలేసే, ఇరాన్.
యుద్ధాల వల్ల స్త్రీలకు సమస్యలు..
మా దేశంలో అప్పుడప్పుడు జరిగే యుద్ధాల వల్ల మహిళలు స్వేచ్చగా బయట తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయి. స్త్రీ స్వేచ్చ విషయంలో మా దేశం కన్నా భారత దేశమే మిన్న. మాదేశంలో స్త్రీలకు అభద్రతా భావం ఎక్కువే. గ్రామీణప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. –బ్రిష్ణ గులామ్ మహ్మద్, అఫ్ఘనిస్తాన్
భారత మహిళలు అదృష్టవంతులు..
మా దేశంతో పోలిస్తే భారత దేశ మహిళలు ఎంతో అదృష్టవంతులు. ఇక్కడ మహిళలకు లభించే గౌరవం చాలా ఉన్నతమైనది. మహిళా దినోత్సవాల సందర్బంగా వివిధ రంగాలకు చెందిన మహిళతో పాటు సాధారణ మహిళలను సైతం గౌరవించే సంస్కృతి మా దేశంలో కొనసాగుతోంది. –ఫర్హా ఆస్టా, కెన్యా