సీఎం సినిమా చూపిస్తున్నారు
మాజీ హోం మంత్రి సబితారెడ్డి
మణికొండ: ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని... రైతులకు మూడేళ్ల వరకే రుణ మాఫీ చేస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోవైపు కొత్త సచివాలయ నిర్మాణానికి ఉవ్విళ్లూరడం వెనుక మర్మమేమిటో రాష్ట్ర ప్రజలందరికీ తెలపాలని మాజీ హోంమంత్రి సబితారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె నార్సింగ్‌లో పార్టీ నాయకులతో కలసి విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ భూముల్లో ఫిలింసిటీ నిర్మాణం, ఎర్రగడ్డలో సచివాలయం, సాగర్ చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తామంటూ రాష్ట్ర ప్రజలకు ఆయన సినిమా చూపిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద అంతలా నిధులు ఉంటే ముందుగా రైతులకు సంపూర్ణ రుణమాఫీతో పాటు మహిళలకు అభయ హస్తం పింఛన్లు... ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు చెల్లించి ఆదుకోవాలని సూచించారు.
సచివాలయాన్ని తరలించే విషయంలో ప్రతిపక్షాలు, ప్రజలకు సమాధాన పరచాలి తప్ప ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడి చేయటం మంచి పద్ధతి కాదన్నారు. వాస్తు బూచి చూపి ప్రభుత్వం స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తోందనే అనుమానం రాష్ట్ర ప్రజల్లో ఉందన్నారు. మణికొండ, పుప్పాలగూడ పంచాయతీల పరిధిలో మంజీర పైప్‌లైన్ పనులు పూర్తి కావటంతో పాటు గతంలోనే జలమండలికి డబ్బులు చెల్లించినందున వెంటనే నీటిని విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
పార్టీ ఆదేశిస్తే పోటీ
జిల్లా నాయకులతో పాటు పార్టీ అధిష్ఠానం సమష్టి నిర్ణయం తీసుకుని ఆదేశిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీకి గెలిచే వ్యక్తులు కావాలని.. తనకు టికెట్టు ఇస్తే పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు.