సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది | Former RBI governor YV Reddy comments on Gold and Financial system | Sakshi
Sakshi News home page

సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది

Published Sun, Jan 29 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM

సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది

సంక్షోభాల్లో బంగారమే ఆదుకుంది

పసిడి నిల్వలతోనే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి
ప్రస్తుతం బంగారంపై అనేక అపోహలు నెలకొన్నాయి
కడ్డీలు, బిస్కెట్లు భారీగా ఉంటేనే నల్లధనంగా గుర్తించాలి
ప్రజల ఆభరణాలకు భరోసా ఉండాలి
ఘనంగా ముగిసిన హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న అనేక సందర్భాల్లో బంగారం నిల్వలు మన ఆర్థిక వ్యవస్థను ఆదుకొన్నాయని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీ రెడ్డి చెప్పారు. విదేశాల తరహాలో బంగారాన్ని కేవలం ఒక మారక వస్తువుగా అంచనా వేయడం సరికాదని, దేశ చరిత్ర, సంస్కృతిలో దానికి గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ముగింపు ఉత్సవాల్లో భాగంగా ఆదివారం మూడోరోజు జరిగిన ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ‘గోల్డ్‌: బ్లాక్, వైట్‌ అండ్‌ ఎల్లో’ అన్న అంశంపై ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘‘హోటల్‌కు వెళ్లి రూ.10 వేలు ఖర్చు చేసినట్లుగా బంగారాన్ని ఖర్చు చేయడం సరైంది కాదు.

బంగారం నిల్వలు పుష్కలంగా ఉంటేనే దేశ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది. మన వద్ద ఉండే బంగారం నిల్వలపైన ఆధారపడే ప్రపంచ దేశాల్లో మనకు ఒక హోదా లభిస్తుంది. 1990లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకొనిపోయినప్పుడు బంగారమే కాపాడింది. ప్రభుత్వం వద్ద బంగారం నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న బంగారం, ఆభరణాలు ఎంతో ఆదుకున్నాయి. అయితే నల్లధనం కూడా బంగారం రూపంలోనే ఉంది. 1990 వరకు ఉన్న నల్లధనం అంతా బంగారం రూపంలోనే బయటకు వచ్చింది. 1997లో బంగారంపై ఒక విధానం అమల్లోకి వచ్చింది. అప్పట్నుంచి బ్యాంకు లావాదేవీల్లో దీన్ని వినియోగిస్తున్నారు’’ అని చెప్పారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బంగారంపై ప్రజల్లో అనేక అపోహలు నెలకొన్నాయని, ఏది నల్లధనం కిందకు వస్తుంది? ఏది రాదు అన్న అంశంపై స్పష్టత అవసరమని అన్నారు. కడ్డీలు, బిస్కెట్ల రూపంలో భారీ ఎత్తున ఉన్న నిల్వలనే నల్లధనం కింద గుర్తించాలన్నారు. ప్రజల వద్ద ఉన్న బంగారు ఆభరణాలకు భరోసా ఉండాలని పేర్కొన్నారు.

11 మంది జీవిత గాథలతో హర్షమందిర్‌ పుస్తకం
ప్రముఖ మానవ హక్కుల ఉద్యమ నేత, రచయిత హర్షమందిర్‌ ఇటీవల రచించిన ‘ఫాటల్‌ యాక్సిడెంట్స్‌ ఆఫ్‌ ఎ బర్త్‌’ పుస్తకంపై నిర్వహించిన చర్చా కార్యక్రమం ఆకట్టుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అణచివేతకు, హింసకు గురవుతున్న సామాజిక వర్గాలకు చెందిన 11 మంది వ్యక్తుల వాస్తవిక జీవితాలను ఆయన తన పుస్తకంలో కథలుగా రాశారు. హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్‌ వేములకు ఆ పుస్తకాన్ని అంకితం చేసినట్లు హర్షమందిర్‌ వివరించారు. ‘‘ఏ మనిషి కూడా ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో, ఏ కులంలో పుట్టాలో తెలుసుకొని పుట్టడు. కానీ దురదృష్టవశాత్తు చాలామంది వారి కులం, పరిస్థితుల వల్ల హింసకు, వివక్షకు గురవుతున్నారు’’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ముగిసిన వేడుకలు
మూడ్రోజులపాటు కన్నులపండువగా జరిగిన 7వ హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ వేడు కలు ఘనంగా ముగిశాయి. సుమారు 16 వేల మందికి పైగా సందర్శకులు తరలి వచ్చారు. 11 దేశాల నుంచి 139 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణ, ఏపీల్లో మహిళల అక్రమ రవాణా: సునీతా కృష్ణన్‌
తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, బాలికల అక్రమ రవాణా ప్రమాద కరంగా ఉందని ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మనుషుల అక్రమ రవాణాపై జరిగి న చర్చలో ఆమె మాట్లాడారు. హైదరాబాద్‌ వంటి రాజధాని నగరంలోనూ మనుషుల అక్రమ రవాణా మాఫియా వేళ్లూనుకుంద న్నారు. ఇలాంటి నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు కఠిన చట్టాలు అవసరమ న్నారు. తన 15వ ఏటా సామూహిక అత్యా చారానికి గురైనప్పుడు సమాజం నుంచి వివక్షకు, బహిష్కరణకు గురయ్యా నని ఆమె చెప్పారు. బెంగళూరులో మిస్‌వరల్డ్‌ పోటీలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టినప్పుడు జైలుకు వెళ్లానని అప్పుడు తన సొంత కుటుంబం నుంచే వివక్షను ఎదు ర్కోవలసి వచ్చిందని చెప్పారు. ఈ రెండు సందర్భాల్లోనూ కుంగిపోకుండా బలంగా నిలబడి పోరాడినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటివరకు 17 వేల మందికిపైగా మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారం నుంచి విముక్తులను చేసి పునరావాసం కల్పించినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement