తెలంగాణకు ముగ్గురు.. ఏపీకి నలుగురు | Four to AP and Three to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు ముగ్గురు.. ఏపీకి నలుగురు

Published Thu, Oct 27 2016 4:25 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

తెలంగాణకు ముగ్గురు.. ఏపీకి నలుగురు - Sakshi

తెలంగాణకు ముగ్గురు.. ఏపీకి నలుగురు

- తెలుగు రాష్ట్రాలకు ఏడుగురు ట్రైనీ ఐపీఎస్‌ల కేటాయింపు
- నేషనల్ పోలీస్ అకాడమీలో 109 మంది ట్రైనీలకు శిక్షణ పూర్తి
- రేపు పాసింగ్ ఔట్ పరేడ్..హాజరు కానున్న అరుణ్ జైట్లీ
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కేడర్‌కు ముగ్గురు, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు నలుగురు ట్రైనీ ఐపీఎస్ అధికారులను కేటాయించింది. తెలంగాణకు రక్షిత కె.మూర్తి(కర్ణాటక), పాటిల్ సంగ్రామ్‌సింగ్ గణపత్‌రావు(మహారాష్ట్ర), చేతన మైలబత్తుల(తెలంగాణ).. ఏపీకి కె.ఆరీఫ్ హఫీజ్(కర్ణాటక), అజిత వేజెండ్ల (ఏపీ), గౌతమి సలి(ఏపీ), బరుణ్ పురకయత్స(అసోం) ట్రైనీ ఐపీఎస్‌లుగా రానున్నారు. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 2015 బ్యాచ్ అధికారులుగా శిక్షణ ముగించుకున్న 109 మంది ట్రైనీ ఐపీఎస్‌ల్లో ఈ ఏడుగురిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు.

అకాడమీలో శిక్షణానంతర కార్యక్రమం దీక్షాంత్ పరేడ్‌ను ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ బ్యాచ్‌లో మరో 15 మంది విదేశీ అధికారులు సైతం శిక్షణ పొందారు. అందులో భూటాన్ నుంచి ఆరుగురు, నేపాల్ నుంచి ఐదుగురు, మాల్దీవుల నుంచి నలుగురు ఉన్నారు. ట్రైనీ ఐపీఎస్‌లకు శిక్షణ తీరు తెన్నులతోపాటు పాసింగ్ ఔట్ పరేడ్ వివరాలను అకాడమీ డెరైక్టర్ అరుణ బహుగుణ బుధవారం వెల్లడించారు. పోలీసు అధికారిగా బహుముఖ బాధ్యతలు నిర్వహించే శక్తి సంపాదించుకునేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు.

 ఇంజనీర్లు, డాక్టర్లే అధికం
 తాజాగా శిక్షణ పూర్తి చేసుకున్న 109 మంది ఐపీఎస్ శిక్షణార్థుల్లో 75 మంది ఇంజనీరింగ్, వైద్య విద్యను చదివిన వారే ఉన్నారు. పది మంది ఆర్ట్స్, తొమ్మిది మంది సైన్స్, ఇద్దరు కామర్స్ నేపథ్యం నుంచి రాగా, 66 మంది ఇంజనీర్లు, తొమ్మిది మంది ఎంబీబీఎస్, తొమ్మిది మంది ఎంబీఏ, ముగ్గురు లా, ఒకరు ఎంఫిల్ చేశారు.

 ఉద్యోగానికి రాజీనామా చేసి..
 ‘‘నేను బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు జరిగిన బాంబు పేలుడు ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. తక్షణమే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సివిల్స్ కోసం శిక్షణ తీసుకున్నాను. ఉన్నత స్థాయి పోలీస్‌గా దేశానికి సేవలందించాలన్న ఆకాంక్షతోనే సివిల్స్‌లో చేరాను’’ అని బెస్ట్ ఆఫ్ రౌండ్ ఐపీఎస్ శిక్షణార్థిగా ఎంపికైన సోనావానే రిషికేశ్ భగవాన్ (మహారాష్ట్ర) పేర్కొన్నారు. ఆయన ప్రధానమంత్రి బాటన్, హోం మంత్రి రివాల్వర్‌ను అందుకోబోతున్నారు.
 
 9 నెలల బిడ్డను ఇంట్లో వదిలి శిక్షణకు..
 ‘‘9 నెలల బిడ్డను ఇంట్లో వదిలి ఐపీఎస్ శిక్షణ కోసం అకాడమీలో చేరాను. ఈ విషయంలో నా భర్త, మహబూబ్‌నగర్ జేసీ శివకుమార్, మా నాన్న, నా కుటుంబం అండగా నిలిచి ప్రోత్సహించింది. ఉస్మానియా ఆస్పత్రిలో ఏడాది పాటు హౌస్‌సర్జన్‌గా పనిచేశాను. మహిళల సమస్యల పట్ల అవగాహన ఉంది. వారి కోసం పనిచేయాలనుకుంటున్నా..’’  
 - డాక్టర్ చేతన మైలబత్తుల
 
 తెలంగాణలో పనిచేయడం ఆనందంగా ఉంది..
 ‘‘మాది డాక్టర్ల కుటుంబం. నేను ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుడిగా ఐదేళ్లు పనిచేయడంతో ప్రజల సమస్యలపై అవగాహన పొందాను. ప్రజలకు సేవ చేసేందుకు ఐపీఎస్‌గా మంచి అవకాశమిది. తెలంగాణలో పనిచేయడం ఆనందంగా ఉంది’’   
- డాక్టర్ పాటిల్ సంగ్రామ్ సింగ్
 
 మహిళల ప్రాతినిధ్యం పెరగాలి..
 ‘‘పోలీసు శాఖలో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలి. మహిళలు సైతం పోలీసు విధులను బాగా నిర్వహించగలరు. మహిళలపై నేరాల నిర్మూలన కోసం పనిచేయాలనుకుంటున్నాను. తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం. రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం బాగా పని చేస్తోంది. ఇందులో భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాను’’                   
- రక్షిత కె.మూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement