గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ.. | A love affair between a Pakistani man and a Kurnool woman | Sakshi
Sakshi News home page

ప్రేమకు పౌరసత్వం అడ్డు

Published Sat, Dec 7 2019 4:14 AM | Last Updated on Sat, Dec 7 2019 11:04 AM

A love affair between a Pakistani man and a Kurnool woman - Sakshi

దౌలత్‌బీ, షేక్‌ గుల్జార్‌ఖాన్‌

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇండియా నుంచి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం సియాల్‌ కోట్‌కు 4–5 నెలలుగా తరచూ ఫోన్లు వెళుతున్నాయి. దీనిపై కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు దృష్టి సారించారు. ఫోన్లు ఎక్కడి నుంచి వెళుతున్నాయని ఆరా తీయగా.. కర్నూలు నుంచి అని తేలింది. సెల్‌ టవర్‌ సిగ్నల్స్‌ ఆధారంగా గడివేముల వాసి షేక్‌ గుల్జార్‌ ఖాన్‌.. పాక్‌కు ఫోన్‌ చేస్తున్నట్టు గుర్తించారు. అతను నెల కిందటే పాస్‌పోర్టు తీసుకోవడం, పది రోజులుగా మరీ ఎక్కువగా పాక్‌కు ఫోన్‌ చేస్తుండటంతో ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఈ నెల ఒకటిన ఆయన గడివేములను ఖాళీ చేసి.. కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌ వెళ్లాడు. దీంతో రెండో తేదీన గుల్జార్‌తో పాటు అతని భార్య, పిల్లలను కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు గుల్జార్‌ది ఓ విచిత్రమైన ప్రేమ కథ అని తేలింది.. 

రాంగ్‌ నంబర్‌.. రియల్‌ లవ్‌!
గుల్జార్‌ది పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌. పేద కుటుంబం.. ఉపాధి కోసం 12 ఏళ్ల కిందట సౌదీ అరేబియా వెళ్లాడు. ఏడాది పాటు అక్కడే పనిచేశాడు. ఓ సారి పొరపాటున రాంగ్‌ నంబర్‌ డయల్‌ చేయడంతో గడివేములలోని దౌలత్‌బీ పరిచయమైంది. ఆమెకు అప్పటికే భర్త చనిపోయాడు. ఓ కుమారుడున్నాడు. తరచూ ఫోన్‌లో మాట్లాడుకున్న వీరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో గుల్జార్‌ సౌదీ నుంచి పాక్‌ వెళ్లకుండా ఇండియా వచ్చారు. పాకిస్థాన్‌ పాసుపోర్టుతో అయితే వీసా తీసుకోవాలి. వీసా గడువు ముగియగానే తిరిగి పాక్‌ వెళ్లిపోవాలి. కానీ గుల్జార్‌ ఇండియాలోనే స్థిరపడాలనే యోచనతో వచ్చాడు.

ఇందుకోసం తాను ఇండియన్‌ అని, పాస్‌పోర్టు పోయిందని సౌదీ పోలీసులకు ఫిర్యాదు చేసి.. వారిని నమ్మించి ఈసీ (ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌) ద్వారా ఇండియా వచ్చినట్టు తెలుస్తోంది. నేరుగా గడివేములకు వెళ్లి దౌలత్‌ను వివాహం చేసుకున్నాడు. వీరి పదేళ్ల సంసారంలో నలుగురు ఆడ పిల్లలు జన్మించారు. పెయింటింగ్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 4–5 నెలలుగా తిరిగి పాక్‌లోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడటం మొదలెట్టాడు. వివాహం, పిల్లల విషయాలు చెప్పేశాడు. దీంతో వారు తిరిగి పాక్‌కు రావాలంటూ విలపించారు. దీంతో నెల కిందట గుల్జార్, దౌలత్‌తో పాటు పిల్లలకూ పాస్‌పోర్టులు తీసుకుని.. పాక్‌లోని కుటుంబ సభ్యులతో మరింతగా మాట్లాడటం మొదలెట్టాడు. 

నేరస్తుడు కాదు.. ప్రేమికుడు!
పోలీసుల విచారణలో అతడు నేరస్తుడు కాదని.. కేవలం ప్రేమించిన మహిళను పెళ్లి చేసుకుని స్థిరపడాలనే వచ్చినట్టు తేలింది. అతనిని రిమాండ్‌కు పంపినట్టు తెలుస్తోంది. దౌలత్‌ఖాన్, వారి పిల్లలను కర్నూలుకు పంపారు. ఇప్పుడు గుల్జార్‌ను పాక్‌కు పంపితే.. దౌలత్, ఆమె పిల్లలు నిరాశ్రయులవుతారు. దౌలత్‌ను కూడా పాకిస్థాన్‌కు పంపితే.. అక్కడ ఆమెకు పౌరసత్వ సమస్య ఉత్పన్నమవుతుంది. గుల్జార్‌ పాక్‌ వాసి అని తేలిపోయింది కాబట్టి ఇప్పుడు ఇండియాలో నివాసముండాలంటే ఇక్కడ పౌరసత్వ సమస్య ఏర్పడినట్టే. ఈ క్రమంలో పోలీసులు, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement