నేటి నుంచి ఇంటింటికీ బీజేపీ
- అన్ని పోలింగ్ బూత్‌లు చుట్టివచ్చేలా కార్యక్రమం
- కేంద్ర పథకాలు, టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై ప్రచారం
సాక్షి, హైదరాబాద్: ఇంటింటికీ తిరిగి ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవడంతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్‌లను చుట్టి వచ్చేలా రూపొందించిన ప్రతిష్టాత్మక కార్యక్ర మానికి సోమవారం నుంచి బీజేపీ శ్రీకారం చుడుతోంది. మే 29 నుంచి జూన్ 12 తేదీల మధ్యలో రాష్ట్రంలోని మొత్తం 32 వేల పోలింగ్ బూత్‌లలో అత్యధికశాతం చేరుకు నేలా 8 వేల మంది నాయకులు, కార్యకర్తల ను పార్టీ సిద్ధం చేసింది. ఒక్కొక్కరు 4 నుంచి 6 పోలింగ్ బూత్‌లకు వెళ్లేలా ఈ కార్యక్ర మాన్ని రూపొందించారు. పార్టీ సిద్ధాంతకర్త పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ శతజయం తి ఉత్సవాల్లో భాగంగా పార్టీ పటిష్టతకు ఉద్దేశించిన కార్యనిర్వాహక్ యోజనలో భాగంగా దీనిని చేపడుతున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొదలుకుని మండల పార్టీ అధ్యక్షుడి వరకు 15 రోజుల పాటు ఇంటిని వదలి, తమకు కేటాయించిన గ్రామాల్లో పోలింగ్ బూత్ స్థాయిల్లోనే పనిచేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలోని 31 జిల్లాలకు రాష్ట్ర స్థాయి ముఖ్య నాయకులను ఎంపిక చేసి, వారంతా వారంరోజులు ఒక జిల్లాలో, మరో వారంరోజులు మరో జిల్లాలో అంటే ఒక్కో నాయకుడు రెండు జిల్లాలను పర్యవేక్షించేలా కార్యక్రమాన్ని రూపొందిం చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, టీఆర్‌ఎస్ సర్కారు వైఫల్యాలపై నాలుగు రకాల కరపత్రాల ద్వారా బీజేపీ నేతలు ప్రజల వద్దకు వెళ్లనున్నారు. కాగా, పోలింగ్ బూత్‌స్థాయిలో ఇంటింటికి వెళ్లిన సందర్భంగా రాజకీయంగా, సామాజికపరంగా ప్రభావం చూపే వారు, ఇతర పార్టీల నాయకుల వివరాలు, కులాలు, మతాల వారీగా ఓట్ల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి దానిని ఒకచోట క్రోడీకరించనున్నారు.