అంతాగప్‌ ‘చిప్’ | Gas Stations special chip | Sakshi
Sakshi News home page

అంతాగప్‌ ‘చిప్’

Published Sun, Feb 2 2014 4:22 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM

అంతాగప్‌ ‘చిప్’ - Sakshi

అంతాగప్‌ ‘చిప్’

పెట్రోల్ బంకులు ప్రత్యేక చిప్‌లతో ఇం‘ధన’ దోపిడీకి పాల్పడుతున్నాయని వెల్లడవడంతో నగరం నివ్వెరపోయింది. బంకులు ‘నయా’వంచనకు పాల్పడుతూ వాహనదారుల జేబులకు చిల్లు పెడుతున్న ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌వోటీ) పోలీసులు బంకుల్లో మోసాలను బయటపెట్టి అప్పుడే నాలుగు రోజులైంది. అయినా ఒక్క బంకుపైనా ఎలాంటి చర్యలూ లేవు.

తూనికలు కొలతల శాఖ తనకేమీ పట్టనట్టే వ్యవహరిస్తోంది. ఫలితం.. సిటీజనులను దారుణ మోసం చేసిన పెట్రోల్ బంకులు దర్జాగా దందా సాగిస్తు న్నాయి. నిజానికి తూ.కొ. శాఖ పెట్రోల్ బంక్‌లను తనిఖీ చేసి పంపింగ్‌లో జరిగే మోసాలను గుర్తించి ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేయాలి. అవసరమైతే లెసైన్స్‌ల రద్దుకు సిఫార్సు చేయాలి. కానీ, ఇక్కడ అటువంటిదేమీ జరగడం లేదు. బంకులకు సాఫ్ట్‌వేర్ చిప్‌లను అందించిన ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన ఎస్‌వోటీ పోలీసులు.. బంక్ నిర్వాహకులపై చీటింగ్ కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారు. తూ.కొ.శాఖ మాత్రం కనీస చర్యలకూ ఉపక్రమించట్లేదు. కొందరు ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే మోసాల బంక్‌లపై చర్యలకు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది.
 
 సాక్షి, సిటీబ్యూరో:  పెట్రోలు బంకుల్లో ‘నయా’వంచనపై సిటీజనులు ఆందోళనకు గురవుతున్నా అధికారుల్లో చలనం లేదు. చర్యలు తీసుకోవాల్సిన తూనికలు కొలతలు శాఖ కనీస చర్యలూ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
 
 ఫిల్లింగ్ స్టేషన్ల సీజ్ ఏదీ..?
 ప్రత్యేక సాఫ్ట్‌వేర్ చిప్ ద్వారా మోసాలకు పాల్పడిన ఫిల్లింగ్ స్టేషన్ల నిర్వహణ యథావిధిగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది.
     
 ప్రభుత్వ నిబంధనల ప్రకారం మోసాలు బయటపడితే సదురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేయడమే కాకుండా సంబంధిత వస్తువులను సీజ్ చేసి కోర్టుకు అప్పగించాలి.
     
 కానీ, పెట్రోల్ బంక్ ఫిల్లింగ్ మిషన్లలో సాఫ్ట్‌వేర్ చిప్ అమర్చి ఇంధనం పంపింగ్‌లో మోసాలకు పాల్పడుతున్నట్లు బహిర్గతమైనప్పటికీ ఇటు పోలీసు శాఖ, అటు తూనికలు, కొలతల శాఖ ఉదాసీన  వైఖరితో వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది.
     
 వాస్తవంగా తూనికలు, కొలతల శాఖ చట్టం ప్రకారం తూకంలో మోసాలు బయటపడితే సంబంధిత యంత్రాలను సీజ్ చే యడమే కాకుండా సదరు సంస్ధల లెసైన్స్‌ల రద్దుకు సిఫార్సు చేయాలి.
     
 కానీ, తూనికలు, కొలతల శాఖ మోసాల బంక్‌లపై కనీసం శాఖాపరమైన కేసులూ నమోదు చేయడం లేదు.  
 
 తూనికలు, కొలతల శాఖ మౌనం
 పెట్రోలు బంకుల కేసుల వ్యవహారంపై తూ.కొ. అధికారులను సంప్రదించగా మాట్లాడటానికి నిరాకరించారు.
     
 సాక్షాత్తు శాఖ రాష్ట్ర కంట్రోలర్‌ను ఫోన్‌లో పలుమార్లు వివరణ కోరేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు.
 
 బంక్‌లను మేం సీజ్ చేయలేం
 సాఫ్ట్‌వేర్ ద్వారా మోసానికి పాల్పడుతున్న పెట్రోల్ బంకులను సీజ్ చేసే అధికారం మాకు లేదు. తూనికలు, కొలతల శాఖకే ఆయా బంకులను సీజ్ చేసే అధికారం ఉంది. సాఫ్ట్‌వేర్ చిప్‌లను సరఫరా చేసిన నిందితులను మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపాం. బంకులోని మిషన్లను మాత్రం మేమే సీజ్ చేశాం.                                             - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
 
 ఆశ్యర్యమనిపిస్తోంది
 పత్రికల్లో సీజ్ చేశామని వచ్చింది. కా నీ పెట్రోల్ బంక్ యథావిధిగా నడుస్తుండటం ఆశ్చర్యమనిపిస్తుంది. ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేస్తే గాని ట్యాంక్‌లో పోస్తున్న పెట్రోల్ తక్కువ వస్తుందన్న విషయం మనకు అర్థం కాలేదు. ఇప్పటికైనా ఇలాంటి బంకులపై కఠిన చర్యలు తీసుకోవాలి.    - రోహిత్, జీడిమెట్ల  
 
 పర్యవేక్షణ అవసరం
 దాడులు నిర్వహించినా బంకుల యాజమాన్యాలు జంకు లేకుండా పెట్రోల్ బంకులు నడుపుతున్నాయి. ఎప్పటికప్పుడు ఈ బంకులపై పర్యవేక్షణ ఉండాలి. అధికారులు మాత్రం మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
 - శేషురావు, ద్విచక్ర వాహనదారుడు
 
 ప్రజల్లో చైతన్యం రావాలి
 వాహనాల్లో ఇం దనం పోయించుకునేటప్పుడు తప్పనిసరిగా ఫిల్లింగ్ యంత్రాల రీడిం గ్‌ను సరిచూసుకోవాలి. ఏమైనా అనుమానం వస్తే వెంటనే అక్కడి సిబ్బందిని ప్రశ్నించాలి. బంకుల్లో మోసాలపై వాహనదారులకు అవగాహనే ఉండటం లేదు.
 - రాజు, ట్రాక్టర్ డ్రైవర్
 
 ప్రతిసారీ మైలేజీ తక్కువే
 ప్రతిసారీ మైలేజీ తక్కువ వస్తోంది. వాహనంలో తేడా ఉందేమోనని మెకానిక్ దగ్గరకు వెళ్తున్నాం. వారు వాహనాన్ని పరిశీలించి బాగానే ఉందంటున్నారు. పెట్రోల్ బంకుల్లో సిబ్బందిని ఒకటి రెండుసార్లు ప్రశ్నించాను. వారు ఎదురు తిరగడంతో మిన్నకున్నా.
     - శ్రీజేష్, ద్విచక్ర వాహనదారుడు
 
 చర్యలు తీసుకోవాలి
 మోసాలకు పాల్పడుతున్న పెట్రోల్ బంక్ తెరిచే ఉండటం విస్మ యం కలిగిస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇలాంటి బంకులపై చర్యలు తీసుకోని అధికారులకూ శిక్షలుంటే బాగుంటుంది.
 - కేశవ్ , అంగడిపేట్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement