- కళ్లముందే బంక్‌ల్లో చోరీ
- నివ్వెరపరుస్తున్న సాఫ్ట్‌వేర్ మోసం
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్ బంకుల పంపింగ్‌లో జరుగుతున్న కొత్త తరహా మోసాన్ని గుర్తించకుండా తూనికల కొలతల శాఖ మొద్దునిద్ర పోతోంది. ఎస్‌వోటీ పోలీసులు దాడులకు దిగితేనే కానీ మేల్కొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు నగరంలోని పెట్రోల్ బంకుల పంపింగ్‌లో యథేచ్ఛగా దోపీడీ కొనసాగుతున్నా అడ్డుకట్ట వేయాల్సిన అధికారులకు మామూళ్ల మత్తు నిద్ర మాత్రం వీడడం లేదు.
పెట్రోల్ వినియోగంలో హైదరాబాద్ మహానగర వాటా రాష్ర్టంలోనే సగానికి పైగా ఉండడంతో డిమాండ్‌ను సాకుగా తీసుకొని పెట్రోల్‌బంకుల యాజమాన్యాలు అక్రమాలకు తెరలేపారు. ఇప్పటికే మీటర్ పంపింగ్‌లో చేతివాటంతో పాటు ఇంధనంలో కల్తీతో వినియోగదారుడు మోసానికి గురవుతున్నాడు. దాంతో ప్రతి లీటర్‌కు 50 నుంచి 99 ఎంఎల్‌ల వరకు తక్కువగా రావడం సర్వసాధరణమైంది. ఆయితే తాజాగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సాఫ్ట్‌వేర్ చిప్ వినియోగంతో పెట్రోల్ పంపింగ్‌పై ‘రిమోట్’ కంట్రోల్ వ్యవహారం వెలుగుచూడటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
తనిఖీలు జరిమానాలతో సరి....
మహానగరంలోని పెట్రోల్ బంకుల మీటర్ పంపింగ్‌లో మోసాలు కొనసాగుతున్నా.. తూనికల కొలతల శాఖ మాత్రం తనిఖీలు చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు కానరావడం లేదు. ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదులు వెళ్ళినప్పుడు మాత్రం ఆయన ఆదేశాల మేరకు మొక్కుబడి తనిఖీలు నిర్వహించి, నామమాత్ర కేసులతో సరిపెట్టడం, చివరకు జరిమానాలతో కేసులను క్లోజ్ చేయడం సర్వసాధరణంగా మారింది. గ్రేటర్ పరిధిలో తూనికల కొలతల శాఖ కూడా గత మూడేళ్లలో సుమారు 352 బంకులను తనిఖీ చేసి మీటర్ పంపింగ్‌లో హెచ్చుతగ్గులు ఉండటంతో కొన్నింటిపై కేసులు నమోదు చేసి జరిమాన విధించి చేతులు దులుపుకుంది.
వాస్తవంగా జరిమానతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయవచ్చు. మరోవైపు బంకుల్లోని మీటర్ పంపింగ్ యూనిట్లను తనిఖీ చేస్తూ సీల్ వేయాల్సి ఉన్నా అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. మహానగరం పరిధిలో సుమారు 330పైగా పెట్రోల్, డీజిల్ బంక్‌లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 40 లక్షల వరకు వివిధ రకాల వాహనాలు ఉన్నాయి. అందులో పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు 29 లక్షలు, డీజిల్‌తో నడిచే బస్సులు, మినీబస్సులు, కార్లు, జీపులు, టాక్సీలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఇతరాత్ర వాహనాలు కలిపి సుమారు 11 లక్షల వాహానాలు వరకు ఉంటాయన్నది అంచనా. ప్రతిరోజు సగటున 30 లక్షల లీటర్ల పెట్రోల్, 33 లక్షల డీజిల్ వినియోగమవుతోంది.
కొత్త మోసం...
నగరంతో పాటు శివార్లలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించడంతో వినియోగదారులు ఆయోమయానికి గురవుతున్నారు. సుమారు 75 బంక్‌లు మోసాలకు పాల్పడతున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో పెట్రోల్‌బంకుల యాజమానుల్లో ఆందోళన రగులుకుంది. కొత్త తరహా మోసంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ కల్గిన చిప్‌ల వినియోగంతో ఫ్యూయల్ మిషన్‌తో తోపాటు బయట ఉండే రిమోట్ పనిచేస్తోంది. వినియోగదారునికి మీటర్‌పై లెక్కలు సరిగ్గానే ఉన్నప్పటికీ పంపింగ్ తక్కువగా జరుగుతుంది. తనిఖీలు జరిగినప్పుడు రిమోట్ ద్వారా చిప్‌ను ఆఫ్ చేస్తే కొలతల్లో తేడా రాకుండా పంపింగ్ మిషన్ పనిచేస్తుంది.దీంతో మోసాలు బయటపడే అవకాశాలు ఉండవు.