
దాండియా.. రెడీయా..!
కలర్‌ఫుల్ స్టిక్స్‌తో, కోలాటంలా అనిపించే నృత్యోత్సవం ఇప్పుడు సిటీ నైట్‌లైఫ్‌కు ట్రెడిషనల్ కలర్. అక్టోబరు నెలలో తాత్కాలిక వారాంతపు వినోదం దాండియా. మోడ్రన్, ట్రెడిషన్‌ల మిక్స్ అయిన దాండియా పండుగకు 10 రోజుల ముందుగానే సిటీజనులు
డ్యాన్స్ క్లాసెస్. డ్రెస్‌లతో సిద్ధమైపోతున్నారు.
- ఎస్.సత్యబాబు
సిటీలో ఈవెంట్
మేనేజర్ల దాండియా నైట్స్‌తో ఈ సంప్రదాయ సందడి సమకాలీన ఒరవడిగా మారింది. సాయంత్రం 6గంటల సమయంలో ప్రారంభమై అర్ధరాత్రి దాకా కొనసాగి నైట్‌లైఫ్ ప్రియుల్ని ఆకర్షిస్తోంది. నృత్యానికి క్విజ్, గేమ్స్, సెలబ్రిటీ లు జతవుతూ ఈవెంట్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి.
సిటీ నలుచెరగులా...
సిటీలోని సిఖ్వాల్ కల్చరల్ అసోసియేషన్, నామ్‌థారి ఈవెంట్స్, ఆది ఈవెంట్స్, లేడీస్ క్లబ్స్, సంఘాలు వీటిని నిర్వహిస్తున్నాయి. రూ.500 మొదలుకొని రూ.2500 వరకూ దాండియా నైట్స్‌కు ప్రవేశ రుసుం ఉండే ఈ ఈవెంట్లలో కొన్ని ఒకటి లేదా రెండు రోజులకే పరిమితమైతే కొన్ని తొమ్మిది రాత్రులూ సందడి చేస్తున్నాయి. మల్లారెడ్డి గార్డెన్స్, క్లాసిక్ గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ వంటి చోట్ల దాండియా ఉత్సవాలకు కనీసం 2 నుంచి 5వేల మంది దాకా హాజరవుతున్నారు. పాతబస్తీలోనూ షురూ అయ్యాయి. ‘రోజూ 3 వేల నుంచి 4వేల దాకా మా ఈవెంట్‌లో పార్టీసిపేట్ చేస్తారు’ అని ఓల్డ్‌సిటీలో దాండియా నైట్స్ నిర్వహించే రాజస్తానీ ప్రగతి సమాజ్ ఎగ్జిబిషన్ సొసైటీ కన్వీనర్ గోవింద్ రాఠీ చెప్పారు. దాండియా నృత్యం నేర్చుకోవాలనుకునేవారి కోసం పలు డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌లు ఇప్పటికే క్లాసులు ప్రారంభించేశాయి. ప్రత్యేక శిక్షణ సంస్థలూ వెలుస్తున్నాయి. ‘గతంతో పోలిస్తే సిటీలో క్రేజ్ బాగా పెరిగి, దాండియాకు అన్ని వయసుల వారూ ఆకర్షితులవుతున్నారు’ అని శిక్షకురాలు ప్రమీలావ్యాస్ చెప్పారు.