జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మిషన్‌లో ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మిషన్‌లో ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు 100 డివిజన్లు గెలుస్తుందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పదే పదే ఎలా చెప్పారని వారు ప్రశ్నించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నోటా ఆప్షన్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారనేది తమకు అనుమానంగా ఉందని చెప్పారు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈవీఎంలకు ప్రింటర్ అమర్చాలన్నారు.
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న చోట్ల కూడా టీఆర్‌ఎస్ గెలుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. కొన్ని డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులకు వారి సొంత ఓట్లే రాకపోవడం ఈవీఎంలో అవకతవకలు జరిగాయనడానికి నిదర్శనమని తెలిపారు. రేపు గాంధీభవన్‌లో జీహెచ్‌ఎంసీ కాంగ్రెస్ అభ్యర్థుల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో డివిజన్ల వారిగా ఈవీఎంల అవకతవకలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరిస్తామని దాసోజు శ్రవణ్, బండా కార్తీక రెడ్డి స్పష్టం చేశారు.