banda karthika reddy
-
ఉద్వేగానికి లోనయిన కార్తీక రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావించి చతికిలపడిన కాంగ్రెస్ పార్టీకి ‘గ్రేటర్’ ఎన్నికల వేళ భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి బుధవారం బీజేపీలో చేరారు. కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో తనకు అలాంటి పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నానని, తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక గ్రేటర్ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని బండ కార్తీక ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం ధారబోశాను. కానీ నాకు ఇవ్వాల్సిన టికెట్‌ను ఆ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది. ఈసారి మేయర్ సీటు బీజేపీదే. ఓటమి భయంతోనే మంత్రి కేటీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు. అంతిమంగా బీజేపీనే విజయం వరిస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ఇక బీజేపీ గ్రేటర్ ఎన్నికల ఇంఛార్జ్ భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే తమ లక్ష్యం అన్నారు. ‘‘డబుల్ బెడ్రూం ఇళ్ళ ఎక్కడని పేదలు అడుగుతున్నారు. వారికి కేసీఆర్ సర్కారు సమాధానం చెప్పాలి. అసలు మీరేం చేశారు’’అంటూ చురకలు అంటించారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రేటర్ మేయర్ పీఠం తమ పార్టీకే దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.(చదవండి: గ్రేటర్ ఎన్నికలు: హైకోర్టు కీలక నిర్ణయం) కాంగ్రెస్ నేతలకు బీజేపీ వల గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బీజేపీ విజయం సాధించే దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్న కాషాయ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసింది. కాంగ్రెస్ పార్టీ నేతలకు వల వేస్తూ మంతనాలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రాత్రి పది గంటల తర్వాత బీజేపీ నాయకులు కాంగ్రెస్ అసంతృప్త నేతల ఇళ్ళకు వెళ్లినట్లు సమాచారం. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ ఇళ్ళకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వారితో చర్చలు సాగించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలతో పాటుగా సనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దేవి ప్రసాద్ నివాసానికి కూడా కాషాయ పార్టీ నేతలు వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి.(చదవండి: నేను ఫైటర్ని.. దేనికి భయపడను : కేసీఆర్) -
గ్రేటర్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలకమైన నేతలు పార్టీని వీడగా.. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కీలకమైన జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గురువారం ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపుల అనంతరం.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2009 నుంచి 2012 వరకు ఆమె హైదరాబాద్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు. (జీహెచ్ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు) రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై మాజీ మేయర్‌కు బీజేపీ భరోసానిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కాషాయం తీర్థం పుచ్చుకునేందుకు బండ కార్తీక రెడ్డి సిద్ధమయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని పరిణామం. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో జోరుమీద ఉన్న బీజేపీ.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. (చదవండి: టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం) -
‘చేయి’ కలపరాదె!
తార్నాక : సికింద్రాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి చివరి దాకా పోరాడారు. అయితే, వివిధ కారణాలతో ఆ సీటుమరొకరికి వెళ్లిపోయింది. అలిగి కూర్చున్న ఆమెను ‘హస్తం’ పెదలు బుజ్జగించి కూటమి అభ్యర్థికి సహకరించాలని కోరగా.. అందుకామె ఓకే అన్నారు. అయితే, శుక్రవారం ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు తార్నాకలో పర్యటించారు. ఇదే సమయంలో చంద్రారెడ్డి బర్త్‌డే విషయం తెలుసుకున్న పద్మారావు ఆయన ఇంటికి వెళ్లారు. శుభాకాంక్షలు తెలిపిన అనంతరం ‘తమ్ముడూ.. మహాకూటమి ఎలాగూ హ్యాండిచ్చింది కదా! నాకు సపోర్టు చేసేందుకు చేయి కలపరాదే’.. అంటూ చంద్రారెడ్డిని కోరారు. -
సేవలందిస్తే ద్రోహం చేశారు
చిలకలగూడ: మూడు దశాబ్దాలుగా సేవ చేస్తున్న తనకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సికింద్రాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బండ కార్తీకచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులతో కలిసి ర్యాలీగా వచ్చిన ఆమె సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వమని చెబుతూనే సికింద్రాబాద్‌తో ఎటువంటి సంబంధం లేని నాయకుడికి టికెట్ కేటాయించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా సేవలు చేసిన తనకు కాంగ్రెస్ పెద్దలు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సన్నిహితులు ఒత్తిడి మేరకు నామినేషన్ వేశానని, దానిని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు తలలు దించుకుంచే రీతిలో విజయం సా«ధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్ ఇంటి ముందు కార్తీక ధర్నా
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన హామీ మేరకు సికిం ద్రాబాద్ ఎమ్మెల్యే టికెట్ తనకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటి ముందు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ధర్నాకు దిగారు. గురువారం ఢిల్లీలోని రాహుల్ నివాసం వద్ద సుమారు 5 గంటలపాటు ఆమె భర్త చంద్రారెడ్డితో కలసి బైఠాయించారు. పార్టీ కోసం తాను, తన భర్త ఎంతో సేవ చేశామని, మేయర్‌గా పనిచేసిన తనను కాదని.. సికింద్రాబాద్ టికెట్‌ను స్థానికేతరులకు ఎలా ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఆర్సీ కుంతియా తనకు ఫోన్ చేసి సికింద్రాబాద్ సీటును వేరే నియోజకవర్గానికి చెందిన బీసీకి ఇస్తున్నట్టు చెప్పారన్నారు. సికిం ద్రాబాద్‌లో కాంగ్రెస్ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసిన తనను కాదని ఇప్పుడు ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఒక మహిళకు ఇంత అన్యాయమా.. ‘2014లోనే నేను టికెట్ ఆశించినా అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జయసుధకు టికెట్ ఇస్తే ఆమెకు మద్దతు ఇచ్చాం. ఇప్పుడు కచ్చితంగా సీటు మాకే ఇవ్వాలని కోరుతున్నాం. జీహెచ్ఎంసీలోని 24 నియోజకవర్గాల్లో ఒక మేయర్‌గా నేను ఎన్నో పనులు చేశాను. నా భర్త కూడా 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు బయటి నుంచి వేరెవరినో తీసుకొచ్చి సీటెలా ఇస్తారు. ఒక మహిళకు కాంగ్రెస్‌లో ఇం త అన్యాయం చేస్తూ ఏం సందేశం ఇవ్వాలనుకుంటు న్నారో పార్టీ పెద్దలే చెప్పాలి. సికింద్రాబాద్ సీటు నాకే ఇస్తామని రాహుల్ గతంలోనే హామీనిచ్చారు. ఇతర పార్టీల నుంచి మాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా కాంగ్రెస్‌ని వీడలేదు. ఇప్పుడు నాకు టికెట్ ఎందుకు నిరాకరించారో పార్టీ పెద్దలే వివరించాలి’ అని కార్తీక డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటల సమయంలో కార్తీక, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకొని తుగ్లక్ రోడ్డు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
రేపు గాంధీభవన్‌లో గ్రేటర్ కాంగ్రెస్ అభ్యర్థుల సమావేశం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ మిషన్‌లో ట్యాంపరింగ్ జరిగిందని తెలంగాణా పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్కు 100 డివిజన్లు గెలుస్తుందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ పదే పదే ఎలా చెప్పారని వారు ప్రశ్నించారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. నోటా ఆప్షన్‌ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తారనేది తమకు అనుమానంగా ఉందని చెప్పారు. బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈవీఎంలకు ప్రింటర్ అమర్చాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ క్యాడర్ బలంగా ఉన్న చోట్ల కూడా టీఆర్ఎస్ గెలుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని మండిపడ్డారు. కొన్ని డివిజన్లలో స్వతంత్ర అభ్యర్థులకు వారి సొంత ఓట్లే రాకపోవడం ఈవీఎంలో అవకతవకలు జరిగాయనడానికి నిదర్శనమని తెలిపారు. రేపు గాంధీభవన్‌లో జీహెచ్ఎంసీ కాంగ్రెస్ అభ్యర్థుల సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో డివిజన్ల వారిగా ఈవీఎంల అవకతవకలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరిస్తామని దాసోజు శ్రవణ్, బండా కార్తీక రెడ్డి స్పష్టం చేశారు. -
మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఓటమి
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి పరాజయం పాలయ్యారు. తార్నాక డివిజన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె.. టీఆర్ఎస్ అభ్యర్థి ఆలకుంట సర్వసతి చేతిలో ఓటమి పొందారు. మరోవైపు గ్రేటర్లో కారు జోరు కొనసాగుతోంది. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం టీఆర్ఎస్ మొదటి స్థానంలో ఎంఐఎం రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో బీజేపీ-టీడీపీ కూటమి ఉండగా, ఇక కాంగ్రెస్ నాలుగో స్థానంతో నిలిచింది. -
కవితను తప్ప మరెవరినీ పిలవరా?
బతుకమ్మ ఉత్సవానికి ఒక్క కేసీఆర్ కూతురు కవితకు తప్ప మరెవరికీ ఆహ్వానాలు ఉండవా అని హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి మండిపడ్డారు. బతుకమ్మ సంబరాల్లో అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ నగరంలో అట్టహాసంగా నిర్వహిస్తామని చెబుతున్న సద్దుల బతుకమ్మ సంబరాలకు జీహెచ్ఎంసీలోని కార్పొరేటర్లు ఎవరికీ ఇంతవరకు ఆహ్వానాలు అందలేదని ఆమె తెలిపారు. అసలు బతుకమ్మ ఉత్సవాలకు కేటాయించిన పది కోట్ల రూపాయలను ఎలా ఖర్చుచేస్తున్నారో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు చెప్పాలని కార్తీకరెడ్డి డిమాండ్ చేశారు.