సాక్షి, హైదరాబాద్ : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. వరుస ఓటములతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీకి నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే కొందరు కీలకమైన నేతలు పార్టీని వీడగా.. మరికొందరు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే కీలకమైన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ముఖ్య నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. గురువారం ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు. బీజేపీ నేతలతో సంప్రదింపుల అనంతరం.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2009 నుంచి 2012 వరకు ఆమె హైదరాబాద్ మేయర్‌గా విధులు నిర్వర్తించారు. (జీహెచ్‌ఎంసీ: ఎమ్మెల్యే వర్సెస్ కార్పొరేటర్లు)
రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని పట్టుదలతో ఉన్న బీజేపీ.. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగానే సికింద్రాబాద్ ఎమ్మెల్యే టిక్కెట్‌పై మాజీ మేయర్‌కు బీజేపీ భరోసానిచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. కాషాయం తీర్థం పుచ్చుకునేందుకు బండ కార్తీక రెడ్డి సిద్ధమయ్యారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని పరిణామం. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో జోరుమీద ఉన్న బీజేపీ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కారు పార్టీకి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతోంది. గ్రేటర్‌లో పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తోంది. (చదవండి: టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం పతనం ఖాయం)
Comments
Please login to add a commentAdd a comment