
‘కోట్ల’ ఆశలు!
బడ్జెట్ వైపు... ప్రభుత్వ శాఖల చూపు
నిధుల కోసం నిరీక్షణ
మరికొన్ని గంటల్లో తేలనున్న ‘లెక్క’
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర బడ్జెట్‌పై గ్రేటర్‌లోని సర్కారు విభాగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ శాసనసభలో బుధవారం ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని కోరుకుంటున్నాయి. విశ్వనగరం దిశగా వడివడిగా అడుగులేస్తున్న మహా నగర పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సర్కారు విభాగాలు భారీ లక్ష్యాలు నిర్దేశించుకున్నాయి. వీటికి బడ్జెట్‌లో నిధుల వరద పారుతుందని ఆశిస్తున్నాయి.
రహదారులు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణ, మురికివాడల్లో కనీస వసతుల కల్పన, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలతో పాటు నేర రహిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు భారీగా నిధులు అవసరమవుతాయని జీహెచ్‌ఎంసీ, జలమండలి, మైనార్టీ సంక్షేమ, గృహ నిర్మాణ శాఖలు, హెచ్‌ఎండీఏ, వైద్య ఆరోగ్యశాఖ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు విభాగాలు ఆశిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి తొలిబడ్జెట్ ఇదే కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా సర్కారు నిధులు విదిలిస్తుందా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
బల్దియా... రూ.2796 కోట్లు
గత ఏడాది బడ్జెట్ (2014-15)లో జీహెచ్‌ఎంసీ రూ.1093 కోట్లు కోరగా... కేవలం రూ.373 కోట్లు కేటాయించారు. అయితే అది కేవలం నాలుగు నెలలకు సంబంధించినది కావడం గమనార్హం. ఆ మాత్రం నిధులు కేటాయించినా ఖర్చు చేసేందుకు వ్యవధి లేకపోయింది. ఈ నిధుల్లో యూసీడీకి రూ.35.03 లక్షలు, ఎంఎంటీఎస్‌కు రూ. 20.83 కోట్లు, పాదచారుల పథకానికి రూ.కోటి, హరిత నగరం ప్రాజెక్టుకు రూ.25 కోట్లు, స్లమ్ ఫ్రీ సిటీకి రూ.250 కోట్లు కేటాయించారు.
విశ్వసనీయ సమాచారం మేరకు తాజా బడ్జెట్ (2015-16)లో వృత్తిపన్ను, ఆక్ట్రాయ్ పన్ను వాటా, వినోద పన్ను, ప్రభుత్వ భవనాల ఆస్తిపన్ను తదితరమైనవి దాదాపు రూ.1750 కోట్లు ప్రణాళికేతర బడ్జెట్‌లో కేటాయించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కోరినట్లు తెలిసింది. ప్రణాళిక నిధుల కింద మరో రూ.1046 కోట్లు కోరినట్లు సమాచారం. మొత్తం రూ. 2796 కోట్లు కోరినట్లు తెలుస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలకు సంబంధించి పత్రికలకు ఎలాంటి సమాచారం ఇవ్వరాదనే ఆదేశాలు ఉండటంతో అధికారులెవరూ పెదవి విప్పడానికి సాహసించడం లేదు.