పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్ | girl gang raped in guise of party by three youth | Sakshi
Sakshi News home page

పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్

Published Fri, Jul 24 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM

పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్

పార్టీకి పిలిచి.. గ్యాంగ్ రేప్

* నగరంలో వీకెండ్ పార్టీలో దారుణం
* ఈ నెల 5న ఘటన... ఆలస్యంగా వెలుగులోకి...
హైదరాబాద్: హైదరాబాద్‌లో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. పీకల్లోతు వరకు మద్యం సేవించిన ‘మృగాళ్లు’ తోటి ఉద్యోగినిపైనే అత్యాచారానికి పాల్పడిన దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్భయ వంటి కఠినమైన చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇలాంటి వారి పైశాచికత్వానికి కళ్లెం వేయలేకపోతున్నాయి. వీకెండ్ పార్టీ పేరుతో ఇద్దరు స్నేహితులు తమతో పాటు పని చేసే యువతిని నగర శివార్లలోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. వారిలో ఒక వ్యక్తి అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టగా, మరో వ్యక్తి సైతం అత్యాచారయత్నం చేశాడు.
 
వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలను ఏసీపీ భాస్కర్‌గౌడ్ వెల్లడించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ యువతి(22) ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తోంది. అదే కంపెనీలో పనిచేస్తోన్న నిహాల్(22), శ్రీకాంత్ (23)లు ఇద్దరు ఆమె సహోద్యోగులు. ఈ నెల 5న వారు ఆమెను వీకెండ్ పార్టీకంటూ ఆహ్వానించారు. తనతోపాటు పని చేసే ఉద్యోగులు కావడంతో ఆమె వారితో వెళ్లింది.
 
పథకం ప్రకారం వారు హయత్‌నగర్‌లోని కుసుమానగర్‌కు చెందిన తమ స్నేహితుడు షైనీ ఇంటికి ఆ అమ్మాయిని  తీసుకెళ్లారు. ఆ రోజు రాత్రి  బాగా మద్యం సేవించారు. మద్యం మత్తులో నిహాల్ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ కూడా ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. మరుసటి రోజు ఉదయం నిహాల్ ఆమెను ఎల్బీనగర్ రింగురోడ్డు వద్ద దింపి వెళ్లాడు. తనపై జరిగిన దాడి, అవమానం పట్ల ఆవేదనకు గురైన ఆమె ఈ నెల 15న తల్లిదండ్రులతో వచ్చి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిహాల్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని కేసును విచారణ చేపట్టారు.  నిందితులపై అత్యాచారం కేసుతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదు చేశారు.
 
రహస్యంగా విచారణ....
ఇలా ఉండగా ఈ కేసు విచారణలో గోప్యతను పాటిస్తోన్న పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు. నిందితుల వివరాలు కూడా బయటకు చెప్పడం లేదు. మరోవైపు హయత్‌నగర్‌లో పార్టీ చేసుకొనేందుకు తన ఇంటిని స్నేహితులకు అప్పగించిన షైనీ పార్టీ జరిగే సమయంలో వారితోనే ఉన్నాడా, లేడా వంటి వివరాలు వెల్లడించడం లేదు. మరోవైపు ఈ నెల 15న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా 23వ తేదీ వరకు పోలీసులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం, మీడియా దృష్టికి రాకుండా జాగ్రత్తలు పాటించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement