
ఉల్లి లొల్లి
‘రాఖీ కట్టిన చెల్లికి ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు చూడండి..’
‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’
‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’
.... ఇవన్నీ పెరుగుతున్న ఉల్లి ధరలపై సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో హల్‌చల్ చేస్తున్న జోకులు. ఉల్లిధర రికార్డు స్ధాయిలో రూ.70కి చేరువ కావడంతో ‘ఆనియన్’ టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి...
ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ విస్తరించింది. ఉల్లి ధరలపై కార్టూన్లు, కామెంట్స్, జోకుల రూపంలో నిరసన వ్యక్తమవుతోంది.
సాక్షి, సిటీబ్యూరో : ప్రజల ఆవేదనకు ప్రతిబింబాలుగా నిలుస్తున్న ‘నెట్’ కామెంట్లు ఇవీ...
‘నేను ఈ మధ్య ఓ జోక్ చూశా.. డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’ ఇది బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల, నటుడు కమల్ కామరాజ్ తదితర సెలబ్రిటీలు ట్విట్టర్‌లో షేర్ చేసిన జోక్. ‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లిధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్‌బేడి ట్విట్టర్‌లో స్పందించారు.
కార్టూన్లు..
ఫేస్‌బుక్‌లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్‌బుక్‌లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్‌లు సోషల్ సైట్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ట్విట్టర్‌లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు.
‘ఉల్లి’జోకులు..
‘ఈ మధ్య బప్పీలహరి ఉల్లి నగలతో కనిపిస్తున్నాడు’
‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.’
‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’
‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’
‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’
‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్‌లు చేసే అవకాశం ఉంది.’
‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’