వ్యవసాయ రంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
► సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ
► ‘భారత రాజ్యాంగం-పనితీరు’ సమావేశంలో ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ‘‘ఎరువులు, పురుగు మందులకు స్థిరమైన ధర ఉంటోంది. కానీ రైతు పండించే పంటకు స్థిరమైన ధర ఉండటం లేదు. ఇది సరి కాదు. రైతులను ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇదే పరిస్థితి కొనసాగితే దేశం కుప్పకూలుతుంది. రాజ్యాంగాన్ని అందరికీ సమానంగా వర్తింపజేస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.. రైతుకు 4 గంటల విద్యుత్‌ను అందించలేకపోతున్నాయి. కానీ పరిశ్రమలకు18 గంటల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాయి’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలగౌడ ఆవేదన వ్యక్తం చేశారు. అఖిల భారత న్యాయవాదుల యూని యన్ (ఐలూ) మాజీ అధ్యక్షుడు దివంగత అనంతారెడ్డి గౌరవార్థం ఐలూ, ఇక్ఫాయ్ సంయుక్తంగా ‘భారత రాజ్యాంగం-పనితీరు’ అంశంపై శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి జస్టిస్ గోపాలగౌడ ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. రైతు అభివృద్ధికి భూమి ఎంతో దోహదపడుతుందన్నారు. తన తండ్రి రైతు కావడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానన్నారు.
ఆస్తి హక్కు మానవ హక్కు...
‘‘భూమి కలిగి ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆస్తి హక్కు మానవ హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీన్ని కాపాడే బాధ్యత న్యాయవ్యవస్థపై ఎంతైనా ఉంది’’ అని జస్టిస్ గోపాలగౌడ స్పష్టం చేశారు. ‘‘1991 తర్వాత వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, 1894 భూసేకరణ చట్టం వల్ల వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయింది. అయినా దీని రక్షణకు రాజ్యాంగం పూర్తిస్థాయిలో దోహదపడలేదు’’ అని జస్టిస్ గోపాలగౌడ పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాల్లో ప్రతిభ ఒక్కటే ప్రామాణికం కాకూడదన్నారు.
సమావేశానికి ఐలూ తెలంగాణ కమిటీ అధ్యక్షుడు జి. విద్యాసాగర్ అధ్యక్షత వహించగా కర్ణాటక హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎన్.నాగమోహన్‌దాస్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, సర్వీస్ ట్యాక్స్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎన్. బుసి, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి తదితరులు ప్రసంగించారు. అనంతారెడ్డి భార్య సుశీలాదేవి, కుమార్తె విజయారెడ్డి, ఐలూ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ, హైకోర్టు ఏపీ, తెలంగాణ బార్ అసోసియేషన్స్ అధ్యక్షులు సి.నాగేశ్వర్‌రావు, గండ్ర మోహన్‌రావు పాల్గొన్నారు.